చిత్తూరు జిల్లాలో 74 మంది వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా కలకలం రేపుతోంది. సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునేంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. చిత్తూరు జిల్లాలో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా తీవ్ర చర్చనీయాంశమైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధిస్తున్నారని పాకాల మండలంలోని వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. వాలంటీర్లను వేధిస్తున్న ఈవోను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అధికార నేతలు వేధింపులు మానుకోవాలన్నారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంత వరకు తాము విధులకు హాజరు కాబోమన్నారు. మొత్తం 76 మంది వాలంటీర్లు రాజీనామా చేస్తున్నామని తెలిపారు.
ఈవో తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమను మానసికంగా చాలా తీవ్ర ఇబ్బందులకు, మనోవేదనకు గురి చేశారన్నారు. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లపై స్థానిక రాజకీయ నేతలు పెత్తనాలు మానుకోవాలని.. అలాగే వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేయాలంటూ తహసీల్దార్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:విశాఖ వీధుల్లో పందుల పందేలు.. ఊలలు, అరుపులు.. స్థానికులు బెంబేలు