Andhra News: తమ్ముడి షాపు ముందు అక్క ధర్నా…ఆదుకోవాలంటూ వేడుకోలు.. ఎక్కడంటే…

| Edited By: Ram Naramaneni

Dec 23, 2024 | 1:22 PM

ఆమె వయస్సు అరవై ఏడేళ్లు... పేరు తులశమ్మ.. ఉండేది గుంటూరులోని కొరటెపాడులో.. అయితే అరండల్ పేటలోని ఐదో లైన్‌లో ఉన్న ఎస్ ఎల్ ఎస్ షాపు ముందు ఫ్లకార్డు పట్టుకొని ఆందోళనకు దిగింది. సొంత తమ్ముడే మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఏంజరిగిందో డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Andhra News: తమ్ముడి షాపు ముందు అక్క ధర్నా...ఆదుకోవాలంటూ వేడుకోలు.. ఎక్కడంటే...
Old Lady Protest
Follow us on

గుంటూరులోని శ్రీనివాసరావు తోటలో ఉంటే తులసమ్మ, అప్పారావు అక్కా తమ్ముళ్లు. పదేళ్ల క్రితం తులశమ్మ భర్త క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అయితే అప్పటి వరకూ తులసమ్మ చిన్న హోటల్ నిర్వహించేది. తులశమ్మ భర్త గుమాస్తాగా పనిచేసేవాడు. తులశమ్మ భర్తకు అనారోగ్యంగా ఉన్న సమయంలో నే తమ్ముడు అప్పారావు వచ్చి వారి దగ్గరున్న పది లక్షల రూపాయలు తీసుకొని పోస్టాఫీస్ లో ఫిక్డ్స్‌ డిపాజిట్ చేస్తానని తీసుకెళ్లాడు. సొంత తమ్ముడే కావడంతో ఆ డబ్బులు తులశమ్మ ఇచ్చి పంపించింది. ఆ తర్వాత తులశమ్మ వద్ద పలు దఫాలుగా ఇరవై లక్షల రూపాయలను వడ్డీగా తీసుకున్నాడు అప్పారావు. ఈ ఇరవై లక్షల రూపాయలకు గాను ప్రామిసరీ నోట్లు కూడా రాసిచ్చాడు. అయితే ప్రస్తుతం తులశమ్మ ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. కూతురి వద్దే నివసిస్తుంది. ఆసుపత్రికి వెళ్లి చూపించుకోవాలంటే డబ్బులు కావాల్సి రావడంతో తమ్ముడి వద్దకు వెళ్లి డబ్బులివ్వాలంటూ అడిగింది. పోస్టాఫీస్‌లో పిక్స్ డ్ డిపాజిట్ తీసి ఇవ్వాలని అడిగింది. అయితే అసలు డిపాజిట్ తన పేరు మీదే లేదని చెప్పాడు తమ్ముడు అప్పారావు. అయితే వడ్డీకి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని ఇవ్వలేనంటూ తమ్ముడు అప్పారావు చెప్పాడు. వ్యాపారం చేసుకుంటూ డబ్బులు లేవని చెప్పడంతో తులశమ్మ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఇదిగో అదిగో అంటూ ఆమెను తిప్పుతున్నారు.

ఇక లాభం లేదనుకొని అరండల్ పేటలోని అప్పారావు షాపు ఎదుట ఆందోళనకు దిగింది. సొంత తమ్ముడే మోసం చేశాడంటూ ప్లెక్స్ చేత పట్టుకొని ధర్నాకు దిగింది. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన డబ్బులు తనకు ఇవ్వాలని వేడుకుటుంది. అయితే పోలీసులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. సొంత తమ్ముడు షాపు ముందు అక్క ఆందోళనకు దిగటంతో ఏంజరిగిందంటూ స్థానికులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.