రక్తదానం.. ప్రాణదానంతో సమానం అంటారు. అలాంటి రక్తం లేక.. కొందరు అంపశయ్యపై అల్లాడుతున్నారు. తెలుగురాష్ట్రాల్లో రక్తం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 46 శాతం వరకు రక్తం కొరత ఉన్నట్టుగా వైద్యవర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. రక్తం నిల్వల కొరతకు కారణమై.. ప్రమాదఘంటికలను మోగిస్తోంది. రక్త సంక్షోభం.. వైద్యరంగానికి సవాలుగా మారింది. తిరుపతిలోని ఆసుపత్రుల్లో రక్తం కొరత కలవర పెడుతోంది. తలసేమియా, రక్తహీనతతో పాటు ఎమర్జెన్సీ కేసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టైం టూ టైం రక్తమార్పిడి అవసరం ఉన్న వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. రుయా, స్విమ్స్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో నిల్వలు అడుగంటడం.. ఆందోళనకంగా మారింది.
కోవిడ్ సమస్యతో రక్తదాన శిబిరాలను నిర్వహించకపోవడంతో.. రక్తసేకరణ దాదాపు పడిపోయింది. దీంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఎమర్జెన్సీ ఆపరేషన్లకు కూడా రక్తం దొరకడం లేదని పేషెంట్ల బంధువులు ఆందోళన చెందుతున్నారు. రుయా ఆసుపత్రిలోని మోడల్ బ్లడ్ బ్యాంకులో సాధారణంగా 300 యూనిట్లకుపైగా ఎప్పుడూ నిల్వలు ఉండేవి. కానీ నేడు అవి 30 యూనిట్లకు పడిపోయాయి. ఏబీ నెగిటివ్, ఏ పాజిటివ్‌తో పాటు మిగతా గ్రూపుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కరోనా దెబ్బకు మూడో వంతు నిల్వలకు రక్తం నిల్వలు పడిపోయాయని వైద్యులు చెబుతున్నారు.
మొన్నటి వరకు బ్లడ్ ఇవ్వాలనుకున్నా.. వ్యాక్సిన్ వేసుకున్నాక 28 రోజుల వరకు ఇవ్వకూడదన్న నిబంధనలు ఉండేది. కానీ ICMR మార్చిన నిబంధనల ప్రకారం రెండు వారాలకు ఇవ్వొచ్చని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలను సడలిస్తున్న క్రమంలో.. రోగుల సంఖ్యకు తగ్గట్టు అత్యవసర శస్త్రచికిత్సలు పెరిగితే మాత్రం.. ఆందోళనకర పరిస్థితులే ఉంటాయని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా తలసీమియా, రక్తహీనత రోగులతో పాటు గర్భిణులు, బర్నింగ్ కేసులు, ఆక్సిడెంట్ కేసులకు బ్లడ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఇప్పుడు అలాంటి కేసులకు కూడా రక్తం దొరకడం లేదు. రక్తం అవసరం కూడా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ముందుగా ప్లాన్ చేసుకున్న ఆపరేషన్లకు, రెండు ప్రమాదాల సమయంలో, మూడవది తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి. కానీ తలసేమియా రోగులకు మాత్రం రక్తం సేకరించిన ఐదు రోజుల లోపే ఫ్రెష్ రక్తం ఎక్కించాలి. వారికి ప్రతీ 20 రోజులకీ రక్తం ఎక్కించాల్సి వస్తుంది. దీంతో ఈ రోగులకు రక్తం కొరత ప్రాణ సంకటంగా మారింది.
Also Read: తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఎంపీ కేశినేని సంచలన వ్యాఖ్యలు.. అంతా డ్రామా అంటూ ఫైర్