East Godavari: అప్పటివరకు చలాకీగా తిరిగిన ఆ ముక్కుపచ్చలారని బాలుడు.. చిన్న పొరపాటు కారణంగా..
చిన్నపిల్లల విషయంలో పేరెంట్స్ చాలా అప్రతమత్తంగా ఉండాలి. ఒక వయస్సు వచ్చేవరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వారు ఆటల్లో పడి.. ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. ప్రమాదాన్ని వారు అస్సలు ఊహించలేరు. తాజాగా ఇక్కడ అదే జరిగింది.
అప్పటివరకు ఆడుతూ చలాకీగా తిరిగాడు ఆ ముక్కుపచ్చలారని గారాల బిడ్డ. అంతలోనే ఇంటి ఆవరణలో గల నీళ్ళ కుండీలో ప్రమాదవశాత్తు జారిపడి విగతజీవిగా మారాడు. ఈ విషాద ఘటన దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన 5 సంవత్సరాల కందివలస గణేష్ నూతనంగా నిర్మిస్తున్న ఇంటి వద్ద గల నీటి కుండీ వద్ద ఆడుకుంటూ జారిపడి 5 అడుగుల లోతులో ఉన్న కుండీలో పడిపోయాడు. కొద్దిసేపటి తరువాత గమనించిన కుటుంబసభ్యులు బాలుడిని కుండీలో నుండి వెలుపలకు తీసి అంబులెన్స్ లో దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు తీసుకు వెళ్లగా అప్పటికే గణేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఊహించని పరిణామానికి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆ ప్రాంతవాసులు దిగ్భ్రాంతి చెందారు. ఊరంతా రోదనలతో మిన్నంటింది. గ్రామంలో కులాయి నూతులకు సరైన రక్షణ ఏర్పరచకపోవడం.. నేల అంచులకు ఉండటం వల్ల ఇటువంటి దుర్ఘటనలు పలుమార్లు జరుగుతున్నాయని.. మళ్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ప్రజలు మేలుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ధూళిపూడి రవీంద్ర సూచిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..