కట్నం వేధింపులకు నిండు గర్భిణీ బలి.. బతికుండగానే నరకం చూపిన భర్త, అత్తమామలు!

భర్త, అత్తామామల కట్నం దాహం ఎందరో ఆడబిడ్డలను బలి తీసుకుంది. తాజాగా మరో నిండు గర్భిణీ వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారనీ, పుట్టింటి వారు ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి దాహం తీరడం లేదని..

కట్నం వేధింపులకు నిండు గర్భిణీ బలి.. బతికుండగానే నరకం చూపిన భర్త, అత్తమామలు!
Pregnant Woman Commits Suicide

Updated on: Aug 16, 2025 | 6:43 AM

అనంతపూరం, ఆగస్ట్‌ 16: అతివలకు అత్తింటి కష్టాలు అనాదిగా వెంటాడుతూనే ఉన్నాయి. భర్త, అత్తామామల కట్నం దాహం ఎందరో ఆడబిడ్డలను బలి తీసుకుంది. తాజాగా మరో నిండు గర్భిణీ వేదింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. అదనపు కట్నం కోసం నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారనీ, పుట్టింటి వారు ఎన్ని డబ్బులు ఇచ్చినా వారి దాహం తీరడం లేదని వాపోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం వారైనా పట్టించుకోకపోవడంతోనే తన గోడు ఎవరికి చెప్పుకోవాలో, ఎటెళ్లాలో తెలియక చివరకు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధిత మహిళ సెల్‌ ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసి సూసైడ్‌ చేసుకుంది. ఈ దారుణ ఘటన అనంతపురంలోని కళ్యాణదుర్గం పట్టణంలో చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

అనంతపురంలోని కళ్యాణదుర్గం పట్టణంకి చెందిన శ్రావణి (23)కు నాలుగేళ్ల కిందట గుండ్లప్పదొడ్డి కాలనీకి చెందిన శ్రీనివాసులతో వివాహం జరిగింది. అత్తింట కాలు పెట్టిన తర్వాత శ్రావణి కాపురం కొంత కాలం సజావుగానే సాగింది. ఆ తర్వాతే వాళ్ల అసలు రంగు బయటపడింది. కొద్ది రోజులకే అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్తతోపాటు, అత్తమామలు నిత్యం మాటలతో చిత్రహింసలు పెట్టేవారు. పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా భర్త, అత్తామామల తీరులో మార్పు రాలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. అదనపు కట్నం వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.

ఐదు రోజుల కిందట కూడా రూ.1.50 లక్షలతో బంగారు నగలు చేయించి ఇచ్చినా అత్తింటి వేధింపులు తగ్గలేదన్నారు. ఈ విషయమై పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. స్థానికంగా ఉన్న తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదును తిరగరాయించుకోవడంతో అత్తింటివారిని ఏం చేయలేకపోయారు. దీంతో ఏ విధంగానూ తన కూతురు శ్రావణికి న్యాయం జరగకపోవడంతో కడుపులో బిడ్డతోపాటు చనిపోయిందని కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, నిందితులను విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిబాబు అన్నారు. ఆగస్ట్‌ 11న కేసు నమోదవడంతోనే శ్రావణి అత్తామామలతోపాటు భర్తను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. పోలీసుల చర్యల్లో లోపం ఉంటే కారకులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.