Modular Hospital: రికార్డు సొంతం చేసుకున్న ఒంగోలు జీజీహెచ్.. 30 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి!

Modular Hospital: రాష్ట్రంలోనే తొలిసారిగా 100 పడకల ఫ్యాబ్రికేటెడ్‌ మెటీరియల్‌ ఆస్పత్రిని నిర్మించారు. ఒంగోలులో రికార్డు స్థాయిలో 30 రోజుల్లో జీజీహెచ్‌ ఆవరణలో నిర్మించారు

Modular Hospital: రికార్డు సొంతం చేసుకున్న ఒంగోలు జీజీహెచ్.. 30 రోజుల్లోనే 100 పడకల ఆసుపత్రి!
Ongole Ggh Modular Hospital

Updated on: Sep 29, 2021 | 4:04 PM

Ongole Modular Hospital: రాష్ట్రంలోనే తొలిసారిగా 100 పడకల ఫ్యాబ్రికేటెడ్‌ మెటీరియల్‌ ఆస్పత్రిని నిర్మించారు. ఒంగోలులో రికార్డు స్థాయిలో 30 రోజుల్లో జీజీహెచ్‌ ఆవరణలో నిర్మించారు. ఇండో–అమెరికన్‌ ఫౌండేషన్‌ సహకారంతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి కోసం రూ.3.50 కోట్ల వ్యయం చేస్తున్నారు. ఆస్పత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం పదిరోజుల్లో దీన్ని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. ఇది వినియోగంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా వీటి నిర్మాణాలు ఉంటాయని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుంది. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోకపోతే ఏం చేయాలి. ఇలాంటి సమస్యలకు సత్వర పరిష్కార మార్గం తక్కువ ఖర్చుత.. అతి తక్కువ సమయంలో ఆస్పత్రులు నిర్మించడం.. ఇలాంటి ఫీట్‌ను చేసి చూపించేందుకు ఇండో–అమెరికన్‌ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో అలాంటి మాడ్యులర్‌ ఆస్పత్రిని రికార్డు స్థాయిలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే నిర్మించేందుకు ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిని ఎంచుకుంది. అందుకు గాను ఇండో – అమెరికన్‌ ఫౌండేషన్‌ రూ.3.50 కోట్లు కేటాయించింది.

రాష్ట్రంలోనే తొలి ఫ్యాబ్రికేటెడ్‌ మెటీరియల్‌ ఆస్పత్రి
ఒంగోలులో రాష్ట్రంలోనే తొలిసారిగా 100 పడకల ఫ్యాబ్రికేటెడ్‌ మెటీరియల్‌ ఆస్పత్రిని నిర్మించారు. జీజీహెచ్‌ ఆవరణలో ఆస్పత్రి పనులు చివరి దశకు చేరుకున్నాయి. వారం పదిరోజుల్లో దీన్ని ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిని పూర్తిగా కోవిడ్‌ కేసులు చూసేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఈ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. మొత్తం 11 బ్లాక్‌లను ఏర్పాటు చేశారు. ఒక బ్లాక్‌ ఓపీకి, మరొక బ్లాక్‌ డ్యూటీ డాక్టర్స్‌ ఉండేందుకు కేటాయించగా, మిగిలిన 9 బ్లాక్‌లను కోవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 8 ఐసీయూ పడకలు ఉండగా, మిగిలినవన్నీ నాన్‌ ఐసీయూ కింద ఆక్సిజన్‌ పడకలతో సిద్ధం చేస్తున్నారు.

అన్ని వసతులతో…
ఇక్కడ బ్లాక్‌లోనే రోగులకు వసతులు సమకూర్చడం విశేషం. ఒక్కో బ్లాక్‌లో 13 మంది వైద్య సేవలు పొందేలా వాటిని డిజైన్‌ చేశారు. ప్రతి పడక వద్ద సీలింగ్‌ ఫ్యాన్‌ ఉంటుంది. అందులోనే బాత్‌రూమ్స్, టాయిలెట్స్‌ను అమర్చారు. జీజీహెచ్‌ తరఫున సిమెంట్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేశారు. విద్యుత్, నీటి సౌకర్యం కల్పించారు. ఇక మిగిలినదంతా ఇండో–అమెరికన్‌ ఫౌండేషనే చూసుకుంటుంది. ఈ ఆసుపత్రి వినియోగంలోకి వచ్చిన తర్వాత 10 నుంచి 15 ఏళ్ల వరకు ఎలాంటి ఆటంకం లేకుండా వీటి నిర్మాణాలు చెక్కుచెదరకుండా ఉంటాయని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

కోవిడ్‌తో పాటు సాధారణ వైద్య సేవలు
ఈ ఆస్పత్రి వల్ల జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. కోవిడ్‌ మొదటి దశలో జీజీహెచ్‌లోని అన్ని పడకలనూ దానికే కేటాయించారు. ప్రస్తుతం సెకండ్, థర్డ్‌ ఫ్లోర్లు కోవిడ్‌ బాధితులకు కేటాయించారు. కోవిడ్‌ బాధితులు ఉండటంతో సాధారణ రోగులు భయపడుతున్నారు. 100 పడకల ఆస్పత్రి వినియోగంలోకి వచ్చిన వెంటనే జీజీహెచ్‌లోని కోవిడ్‌ బాధితులను ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తారు. కోవిడ్‌ పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ 100 పడకలను నాన్‌ కోవిడ్‌ కిందకు మార్చి వైద్య సేవలు అందేలా చేస్తామని రిమ్స్‌ సూపరింటెండెంట్‌ శ్రీరాములు తెలిపారు… రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మిస్తున్న 100 పడకల ఫ్యాబ్రికేటెడ్‌ మెటీరియల్‌ ఆస్పత్రి కోసం ఒంగోలును ఎంచుకోవడం ఆనందంగా ఉందని, ఇండో – అమెరికన్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు.

Read Also…  Hyderabad City police: అనవసరంగా హారన్ కొట్టొద్దు.. ఫన్నీ ట్వీట్ చేసిన హైదరాబాద్ పోలీసులు..