
దసరా పండుగ సందర్భంగా కర్నూలు జిల్లా దేవర గట్టులో జరిగే కర్రల సమరం మరోసారి రక్తసిక్తమైంది. సుమారు రెండు గంటల పాటు కురిసిన జోరు వానలో కూడా బన్నీ ఉత్సవం ఓ రేంజ్ లో సాగింది. మాలమల్లేశ్వర స్వామి విగ్రహం కోసం రెండు వర్గాలకు చెందిన వేలాది మంది ఎప్పటిలాగానే కర్రలతో కొట్టుకున్నారు. మాలమల్లేశ్వర స్వామి వారిని తీసుకుని వెళ్లేందుకు అనేక ప్రజలు అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకున్నార. స్వామివారికోసం ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. సంప్రదాయ ఉత్సవం పేరుతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో 70 మందికి పైగా గాయపడ్డారు. తలలు పగిలాయి. గాయపడిన భక్తులకు అక్కడిక్కడే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో చికిత్సనందించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే గాయపడిన వారి వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఆసుపత్రి వద్దకు మీడియాకు పోలీసులు అనుమతినివ్వలేదు.
ఈ సాంప్రదాయ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా భక్తుల హింసాత్మక ధోరణిని మాత్రం అడ్డుకోలేకపోయారు. ఉత్సవాలను చూడడానికి భారీ సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరయ్యారు. ఉత్సవాన్ని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన కర్నాటక లో మాడ సుగురూ గ్రామానికి చెందిన రవీంద్రరెడ్డి గుండె పోటుతో (17) మృతి చెందారు.
ఈ కర్రల సమరం విషయంలో సుమారు 40 గ్రామాల ప్రజలకు , స్వామి వారి భక్తుల్లో చైతన్యం తీసుకు వచ్చేనందుకు ఎప్పటినుంచో ప్రభుత్వ అధికారులు, స్వచ్చంద సంఘాలు అనేక కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేపడుతున్నారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితాలను ఇవ్వడంలేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..