we will help india says us:భారత ప్రజలకు అండగా ఉంటాం, అదనపు సాయం చేస్తాం, అమెరికా ప్రకటన
కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ఈ ఔట్ బ్రేక్ సమయంలో ఇండియాలో తలెత్తిన పరిస్థితి పట్ల తమ హృదయం ద్రవించిపోతోందని...
కోవిడ్ సెకండ్ వేవ్ తో అల్లాడుతున్న భారత దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. ఈ ఔట్ బ్రేక్ సమయంలో ఇండియాలో తలెత్తిన పరిస్థితి పట్ల తమ హృదయం ద్రవించిపోతోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లైకెన్ అన్నారు. భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు తాము సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఇండియాకు అదనపు సపోర్ట్ అందజేస్తామని, హెల్త్ కేర్ వర్కర్స్ కి తోడ్పడుతామని అన్నారు. ఇండియాను తమ భాగస్వామ్య దేశంగా ఆయన అభివర్ణించారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి సాయపడేందుకు ప్రాధాన్యమిస్తామన్నారు. అటు-సౌదీ అరేబియా నుంచి ఆక్సిజన్ ను తెప్పిస్తున్నామని పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తెలిపారు. సౌదీ నుంచి 5 వేల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సిలిండర్లను తెప్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇవి త్వరలో రానున్నాయన్నారు. ఈ విషయంలో చొరవ తీసుకున్న సౌదీ రాయబారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.డామమ్ నుంచి ముంద్రాకు 80 టన్నుల ఆక్సిజన్ వస్తోందని, అక్కడి నుంచి ఇది ఇండియాకు చేరనుందని అదానీ వెల్లడించారు. గుజరాత్ కు 1500 ఆక్సిజన్ సిలిండర్లను పంపుతున్నామన్నారు. ముఖ్యంగా కచ్ జిల్లాలోని రోగులకు ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పారు.
కాగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి పరిస్థితి కొంతవరకు మెరుగు పడింది. ఈ హాస్పిటల్ కు ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందింది. దీన్ని 11 గంటల నుంచి 12 గంటలవరకు రోగులకు వాడవచ్చునని డాక్టర్లు తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఆసుపత్రి యాజమాన్యం నాలుగు ఎస్ ఓ ఎస్ మెసేజులను పంపింది. అప్పటికి ఆసుపత్రిలో ఓ గంటకు మాత్రం సరిపడే 500 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ ఉంది. ఈ పరిస్థితుల్లో సుమారు 100 మంది రోగులకు రిస్క్ ఏర్పడిందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.