అమెరికాలో అరెస్టయ్యారు.. ఇండియాకు తిరిగొస్తున్నారు
తమ దేశంలోకి దొంగచాటుగా, చట్ట విరుధ్ధంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా ఇండియాకు తిప్పి పంపిస్తోంది. వీళ్ళు ఈ వారంలో స్వదేశానికి చేరనున్నారు. వీళ్ళలో చాలామంది...

తమ దేశంలోకి దొంగచాటుగా, చట్ట విరుధ్ధంగా ప్రవేశించిన 161 మంది భారతీయులను అమెరికా ఇండియాకు తిప్పి పంపిస్తోంది. వీళ్ళు ఈ వారంలో స్వదేశానికి చేరనున్నారు. వీళ్ళలో చాలామంది మెక్సికోతో గల అమెరికా దక్షిణ సరిహద్దుల నుంచి గప్ చుప్ గా ఆ దేశంలోకి ఎంటరయినవారే. అక్కడ నివసించడానికి గల అన్ని లీగల్ ఆప్షన్స్ మూసుకుపోవడంతో ఇక ‘ఇంటిదారి’ పట్టక తప్పలేదు. వీరికోసం ప్రత్యేక చార్దర్డ్ విమానం అమెరికా వెళ్లి అక్కడ నుంచి పంజాబ్ లోని అమృత్ సర్ కి తీసుకురానుంది. యుఎస్ లోని 95 జైళ్లలో మగ్గుతున్న 1739 మంది భారతీయుల్లో వీరు కూడా ఉన్నారని నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ తెలిపారు. ఈ భారతీయుల లిస్టు లో హర్యానాకు చెందిన 76 మంది, పంజాబ్ నుంచి 56, గుజరాత్ నుంచి 12, యూపీ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి నలుగురు, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున, ఏపీ, గోవా నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. చట్ట విరుధ్ధంగా యుఎస్ లో ప్రవేశించిన వీరిని అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు.
2018 లో అమెరికా 611 మందిని ఇండియాకు పంపివేసింది. గత ఏడాది ఈ సంఖ్య 1616 కి పెరిగింది. తాజాగా ఇండియాకు వస్తున్నవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. అమెరికా మీద ‘వ్యామోహం’, డాలర్ల మీద మోజుతో ఈ ‘అక్రమ భారతీయులు’ ఏజెంట్లకు 35 లక్షల నుంచి 50 లక్షల రూపాయలవరకు ముట్టజెప్పారట!