Military Drills: కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న అమెరికా.. దక్షిణ కొరియాతో కలిసి జాయింట్ మిలిటరీ డ్రిల్స్
అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేపట్టిన ఈ సైనిక విన్యాసాలను ఇప్పటికే ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ దక్షిణ కొరియాలో పర్యటించడంపై కూడా ఆగ్రహించింది.
కొంత కాలంగా ఈస్ట్ ఏసియా మీద ఫోకస్ పెంచింది అమెరికా. ఇందులో భాగంగా దక్షిణ కొరియాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాల కోసం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ జాయింట్ మిలటరీ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రివర్ క్రాసింగ్ ఎక్సర్‌సైజ్ రూపంలో సన్నాహకాలు ప్రారంభించారు. ఇరు దేశాల సైనిక విమానాలు, ట్యాంకర్లతో పాటు దాదాపు వేయి మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. నమ్‌హాన్ నదిని దాటేందుకు అమెరికా, దక్షిణ కొరియా దేశాల సైనిక ఇంజినీరింగ్ విభాగాలు కృత్రిమ వంతెనలను నిర్మించాయి. కాగా అమెరికాతో కలిసి దక్షిణ కొరియా చేపట్టిన ఈ సైనిక విన్యాసాలను ఇప్పటికే ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ దక్షిణ కొరియాలో పర్యటించడంపై కూడా ఆగ్రహించింది. ఇందులో భాగంగా గత నెల సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ 8 క్షిపణులను పరీక్షించింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతను పెంచుతోందని, తమను రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే హెచ్చరించింది ఉత్తర కొరియా.
కాగా సౌత్ చైనా సముద్రంలో చైనా ప్రాభల్యాన్ని సవాలు చేయడలమే లక్ష్యంగా ఇక్కడి దేశాలను అమెరికా దువ్వుతోంది. చైనా, ఉత్తర కొరియాలను కట్టడి చేసేందుకు అమెరికా వ్యూహాలు పన్నుతోంది. ఈ యుద్ద విన్యాసాల కోసం అమెరికా 35, దక్షిణ కొరియా 140 యుద్ద విమానాలను రంగంలోకి దింపుతున్నాయి. ఇటీవలే జపాన్‌తో కలిసి విన్యాసాలు నిర్వహించింది అమెరికా. దీనికి ప్రతిగా ఉత్తర కొరియా కూడా క్షిపణీ పరీక్షలను నిర్వహిస్తోంది. అసలు తగ్గేదేలే అంటూ ఈ ఏడాది అక్టోబరు వరకు 40కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. కొద్ది రోజుల క్రితం ఒక క్షిపణిని కొరియా ద్వీపకల్పానికి, జపాన్‌కు మధ్యనున్న సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఆపైన సముద్రంలోకి ఫిరంగి గుళ్లను పేల్చింది. దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోకి యుద్ధ విమానాలనూ పంపింది. తద్వారా ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సముద్ర, భూ సరిహద్దుల వెంబడి విమానాలు ఎగరకూడదంటూ గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉత్తర కొరియా యథేచ్ఛగా ఉల్లంఘించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..