ఇగోర్ వోవ్‌కోవిన్స్కీ.. అమెరికాలో ఈ పేరు తెలియని వారుండరు. కానీ ఇప్పుడు ఆ పేరు చరిత్రలో కలిసిపోయింది. ఆ విషయాన్ని స్వయంగా అతని తల్లి సోషల్‌మీడియా ద్వారా పంచుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అమెరికాలో అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఇగోర్ వోవ్‌కోవిన్స్కీ ఇకలేరు. గుండె జబ్బుతో రోసెస్టర్, మిన్నెసోటాలోని మాయో క్లినిక్‌లో చికిత్స పొందుతున్ ఇగోర్ ఆగస్టు 20న మరణించాడు. అతని తల్లి, స్వెత్లానా ఫేస్‌బుక్ పోస్టు ద్వారా ఈ విషయాన్ని ప్రజలకు తెలిపింది. 1982 సెప్టెంబర్‌లో జన్మించిన వోవ్‌కోవిన్స్కీ 38 ఏళ్లకే మరణించారు. గతంలో అమెరికాలో ఉన్న ఎత్తైన మనిషి జార్జ్ బెల్‌ను అధిగమించి 7 అడుగుల 8 అంగుళాల ఎత్తుతో ఇగోర్ రికార్డ్ సృష్టించాడు. పిట్యూటరీ గ్రంథి, గ్రోత్ హార్మోన్ సమస్యతో ఇగోర్ బాధపడేవారు. అతను 1989లో చికిత్స కోసం మొట్టమొదటగా మాయో క్లినిక్‌కు వచ్చాడు. అతనికి 27 ఏళ్లు వచ్చేసరికి, అతన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా అమెరికాలో అత్యంత పొడవైన వ్యక్తిగా ప్రకటించారు. దాదాపు 10 సంవత్సరాల తరువాత, అతను తన యూట్యూబ్ ఛానెల్‌లో గుండె జబ్బుతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించాడు. ఇగోర్ తన తల్లితోనే పెరిగాడు. అతడు రోచెస్టర్ జాన్ మార్షల్ హై స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను నగర కమ్యూనిటీ కళాశాల నుండి డిగ్రీని కూడా పొందాడు. 38 ఏళ్లు ఉన్న ఇగోర్ న్యాయవాది కావాలనుకున్నాడు. కానీ ఆలోపే మరణించాడు.
అతని మృతిపట్ల చాలామంది అమెరికన్లు, ఇతర దేశాల్లో ఉన్న ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేశారు. ఇగోర్ మరణించిన విషయం కూడా ఆలస్యంగా బయటకు వచ్చింది.
Also Read: ఈ రాశివారికి ప్రమోషన్లు లేదా ట్రాన్స్‌ఫర్‌లు.. వ్యాపారులకు లాభాలు..