అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్‌బుక్ ఖాతాపై రెండేళ్ల నిషేధం విధించినట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది. తమ నియమ నిబంధలను ట్రంప్ తీవ్రస్థాయిలో ఉల్లంఘించారని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన ఖాతాను కనీసం 2023 వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజం పేర్కొంది. ‘‘ఆయన చర్యలు మా నియమాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లే కొత్తగా వచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం విధించ గలిగిన అత్యంత కఠినమైన శిక్ష ఆయనకు వేయాలి’’ అని ఫేస్‌బుక్ తెలపింది. జనవరిలో యూఎస్ కాపిటోల్ భవనంపై జరిగిన మూక దాడి తర్వాత ట్రంప్ ఖాతాను ఫేస్‌బుక్ బ్యాన్ చేసింది. దీనిపై ఫేస్‌బుక్ ఓవర్‌సైట్ బోర్డు కూడా మే నెలలో సమావేశమై ట్రంప్ ఖాతాపై బ్యాన్‌ను కొనసాగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఎంత దుందుడుకు వ్యాఖ్యలు చేసేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరిపైన అయినా, ఎంతటి వ్యాఖ్యలు చేసేందుకు అయినా ఆయన వెనుకడుగు వేసేదేలేదు. దీంతో ఇప్పుడు ఆయన అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా మూసేసింది.
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. ట్రంప్ ఖాతాలను రెండేళ్ల పాటు నిలిపివేసింది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లోని ఆయన ఖాతాలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. తమ నియమ నిబంధలను ట్రంప్ తీవ్రస్థాయిలో ఉల్లంఘించారని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 7నే ట్రంప్ ఖాతాల కార్యకలాపాలను అడ్డుకున్న ఫేస్ బుక్… ఈ తేదీ నుంచే తాజా నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కాగా, దీనిపై స్పందించిన ట్రంప్.. ఫేస్ బుక్ తన చర్య ద్వారా, గత ఎన్నికల్లో తనకు ఓటేసిన కోట్లమంది ప్రజలను అవమానించిందని పేర్కొన్నారు.