Indo-Americans: అమెరికాలో ఇండియన్లు 1 పర్సెంట్.. కానీ చెల్లించే ట్యాక్స్ ఎంతో తెల్సా..?
భారతీయ- అమెరికన్లు గొప్ప దేశ భక్తులు. వారు సమస్యలు సృష్టించేవారు కాదు. ఉన్న చట్టాలను అనుసరించడంలో నెంబర్ వన్. ఈ మాటలన్నదెవరో కాదు.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు. ఆ వివరాలేంటి..
భారతదేశ జనాభా సుమారు 130 కోట్లు. వీరిలో టాక్స్ పేయర్లు.. కేవలం సుమారు ఆరున్నర శాతం. అదే అమెరికాలో నివసిస్తోన్న భారతీయులు.. ఆ దేశ జనాభాలో వన్ పర్సంట్. ఒకే ఒక్క శాతం. కానీ వీరు కట్టే పన్ను.. అమెరికన్లు కట్టే ట్యాక్స్ లో ఆరు శాతం అంటే నమ్ముతారా? ఈ మాట అన్నది మరెవరో కాదు.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు.. రిచ్ మెక్ కార్మిక్. రిచ్ మెక్ కార్మిక్ అనే అమెరికన్ కాంగ్రెస్ మెంబర్.. హౌస్ ఫ్లోర్ లో చేసిన తన తొలి ప్రసంగంలో ఈ మాటలన్నారు. వృత్తి రీత్యా వైద్యుడైన రిచ్.. తన డాక్టర్స్ అసోసియేషన్ గురించి చెబుతూ.. తమ కమ్యూనిటీలోని ఐదుగురు వైద్యుల్లో ఒకరు భారతీయ డాక్టర్లున్నారనీ.. ఇండో అమెరికన్స్ గొప్ప దేశ భక్తులు.. ఉత్తమ పౌరులనీ.. వీరు ఎంతో స్నేహ పూర్వకంగా ఉంటారని ప్రశంసల వర్షం కురిపించారు.
రిపబ్లికన్ అయిన మెక్ కార్మిక్ జార్జియాలోని ఆరవ కాంగ్రెస్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇది అట్లాంటాలోని ఉత్తర శివారు ప్రాంతాలను కలిగి ఉంటుంది. రిచ్ ఇక్కడి నుంచి గత- నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్ధిపై విజయం సాధించారు. అమెరికన్ సమాజ నిర్మాణంలో.. కుటుంబ విలువలను పాటించే వారిలో భారతీయ అమెరికన్లు.. ఎంతో ఉత్తమమైన వారు. వీరి ద్వారా సమస్యలు ఏర్పడ్డం తాను ఇంత వరకూ చూడలేదనీ.. తమ జార్జియాలో గణనీయమైన సంఖ్యలో ఇండో అమెరికన్లు ఉన్నారనీ. లక్ష మంది గల తన కమ్యూనిటీలో భారతీయ అమెరికన్ల సంఖ్య పెద్ద స్థాయిలో ఉందని అన్నారు రిచ్ మెక్ కార్మిక్.
చట్టాన్ని పాటించడంలో.. వీరి తర్వాతే ఎవరైనా. అత్యంత క్రమశిక్షణ కలిగి ఉంటారనీ.. వీరు ట్రబుల్ మేకర్స్ కానే కాదనీ.. పైపెచ్చు చట్టాలను అనుసరించడంలో వారి తర్వాతే ఎవరైనా అంటూ ఇండో అమెరికన్లను ఆకాశానికి ఎత్తేశారీ యూఎస్ కాంగ్రెస్ మెంబర్. రిచ్ కార్మిక్ మాటలను బట్టీ చూస్తే.. యూఎస్ లో ఇండో అమెరికన్లొక రోల్ మోడల్. వీరి సంఖ్య ఎంత పెరిగితే అంత మంచిది. ఈ దిశగా మన ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించాలనీ.. ఎందుకంటే ఇండో అమెరికన్లు.. ఎంతో క్రియేటివ్ గా అంతే ప్రొడక్టివ్ గా ఉంటారనీ.. ఎవ్వరైనా సరే.. వీరిని చూసి నేర్చుకోవల్సిందేనంటారు అమెరికన్ కాంగ్రెస్ మెంబర్. భారతీయ అమెరికన్ల గురించి రిచ్ మెక్ కార్మిక్.. అమెరికన్ కాంగ్రెస్.. హౌస్ ఫ్లోర్లో సగర్వంగా చాటి చెప్పడం చూస్తే.. ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగడం ఖాయం.
మరిన్ని అంతర్జాతీయ వార్తాకథనాల కోసం క్లిక్ చేయండి.