California Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన కాలిఫోర్నియా.. సునామీ ప్రమాదం లేదన్న అధికారులు
Earthquake in California: కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. యూఎస్ జియోలాజికల్
Earthquake in California: కాలిఫోర్నియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ధాటికి ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం ఉత్తర కాలిఫోర్నియా తీరంలో 6.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. హంబోల్ట్ కౌంటీకి సమీపంలో ఉన్న కేప్ మెండోసినో సమీపంలో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ ప్రకంపనల ప్రభావం శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని చికో వరకు కనిపించిందని పేర్కొంది. 2010 నుంచి ఇప్పటివరకు ఇలాంటి భూకంపాన్ని చూడలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హంబోల్ట్ కౌంటీ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అయితే.. గాయాలు లేదా విపత్తు నష్టం గురించి ఎటువంటి సమాచారం లేదు. చాలా చోట్ల ఇళ్లల్లో పగిలిన అద్దాలు, కిందపడ్డ వస్తువులు లాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. కొంతమేర నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే.. వాయువ్య యూఎస్‌లో 24 గంటల్లో 40 కంటే ఎక్కువ భూకంపాలు సంభవించాయని పేర్కొంటున్నారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. హంబోల్ట్ కౌంటీలోని కాలిఫోర్నియా లాస్ట్ కోస్ట్ ప్రాంతంలోని పెట్రోలియా పట్టణానికి పశ్చిమాన 24 మైళ్ళు (39 కిమీ) దూరంలోని పసిఫిక్ మహాసముద్రంలో (యూరేకా తీరం) 9 కిమీ (5.6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.10 గంటలకు 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు హంబోల్ట్ కౌంటీ షెరీఫ్ విభాగం తెలిపింది.
కాగా ఈ భారీ భూకంపం అనంతరం సునామీ వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. కానీ.. అనేక ప్రకంపనల అనంతరం సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే, శాస్త్రవేత్తలు, వాతావరణశాఖ పేర్కొన్నారు.
Also Read: