రెండు అంటే రెండు రోజుల్లో ప్రపంచ జనాభా 800 కోట్లను చేరుకుంటోంది. 2050 నాటికి ప్రపంచ జనాభా భారత్‌తో సహా కేవలం 8 దేశాల పైనే కేంద్రీకృతమై ఉంటుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జనాభా పెరుగుదల వేగం తగ్గినప్పటికి భూమిపై పడే భారాన్ని కాపాడడానికి అప్రపత్తంగా ఉండాలని యూఎన్ సూచించింది.
మరో రెండు రోజుల్లో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటబోతోంది. దీంతో ప్రపంచ జనాభా మరో మైలురాయికి చేరబోతోంది. . నవంబర్ 15నాటికి భూమి మీద మానవ జనాభా 8వందల కోట్లను దాటడం అంటే మామూలు విషయం కాదు. ప్రపంచ జనాభాపై నివేదికను విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి అనేక కీలక విషయాలను వెల్లడించింది . జనాభా విస్ఫోటనంతో ఉన్న మంచిచెడును సమగ్రంగా ఈ నివేదిక వివరించింది. మనిషి తాను సాధించిన పురోగతిని చూసి గర్వించాల్సిన సమయం ఇదే అయినప్పటికి ఈ భూగోళాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని యూఎన్ స్పష్టం చేసింది.
అంతేకాదు 2023 నాటికి చైనాను దాటి అధిక జనాభా గల దేశంగా భారత్ నెంబర్‌వన్ అవతరించబోతోంది. 2030 నాటికి ప్రపంచ జనాభా 850కోట్లు, 2050 వరకు 970కోట్లు, 2080లో వెయ్యి 40కోట్లకు చేరనుంది. ఆ తర్వాత మరో ఇరవై ఏళ్లు అంటే 2100 వరకు మానవ జనాభా వెయ్యి 40 కోట్ల వద్ద స్థిరంగా వుండబోతోంది. 2050 నాటికి పెరిగే జనాభాలో సగం వాటా కేవలం… భారత్, పాకిస్థాన్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల నుంచే
ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది.
జనాభా గణాంకాలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యరంగంలో మానవాళి సాధించిన అభివృద్ది కారణంగా మనిషి ఆయువు పెరిగిందని , శిశుమరణాలు గణనీయంగా తగ్గాయని వ్యాఖ్యానించారు. జనాభా విస్ఫోటనం కారణంగా భూమిపై ఎంతో భారం పడుతుందని , ఈవిషయంలో మానవాళి చాలా బాధ్యతాయుతంగా ఉండాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాల్సిన సమయనం ఆసన్నమయ్యిందని స్పష్టం చేసింది.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన UN వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ అంచనా వేసింది. 1950 తర్వాత తొలిసారిగా 2020లో ప్రపంచ జనాభా పెరుగుదల ఒక శాతం కంటే తక్కువగా పడిపోయిందని ఐక్యరాజ్యసమితి సంచలన విషయాన్ని వెల్లడించింది. 2050 నాటికి అంచనా వేసిన జనాభాలో సగానికిపైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని నివేదిక తెలిపింది. మెజారిటీ సబ్-సహారా ఆఫ్రికన్ దేశాలు, అలాగే ఆసియా, లాటిన్ అమెరికా, కరేబియన్‌లోని కొన్ని ప్రాంతాలు ఇటీవలి సంతానోత్పత్తి క్షీణించడం కారణంగా జనాభా వైవిధ్యం ఉందని తెలిపింది.
గతంతో పోలిస్తే ప్రపంచ జనాభా పెరుగుదల వేగం తగ్గుతోందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 1950 తర్వాత జనాభా వృద్ధి రేటు ఇప్పుడు అత్యంత తక్కువగా ఉన్నప్పటికీ, 2080ల నాటికి 1040 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే, కొందరు జనాభాశాస్త్రం నిపుణులు మాత్రం ఇది మరింత తొందరగా జరుగవచ్చని చెబుతున్నారు.
చైనా జనాభా పెరుగుదల రేటు ఎన్నడూ లేనంతగా పడిపోయింది. అదే సమయంలో, ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతను చూస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు ప్రతీ మహిళకు సగటున 2.1 కంటే తగ్గిపోయింది. 61 దేశాల్లో 2050 నాటికి జనాభా కనీసం 1 శాతం తగ్గుతుందని నివేదిక చెబుతోంది.
ప్రపంచంలోనే అతి తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. చైనాలో ప్రతీ మహిళ సగటున 1.15 మంది పిల్లలకు జన్మనిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి తమ జనాభాలో క్షీణించడం ప్రారంభమవుతుందని చైనా ప్రకటించింది. దేశంలో ‘ఒకే బిడ్డ’ అనే విధానాన్ని రద్దు చేసినప్పటికి , ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే జంటలకు ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా అనుకున్నదానికంటే వేగంగా తగ్గుతోంది.
అదే సమయంలో భారత జనాభా మాత్రం వేగంగా పెరుగుతోంది. అయితే జనాభా పెరుగుతోన్న చాలా దేశాల్లోనూ సంతానోత్పత్తి రేట్లు పడిపోతున్నాయి. సైన్స్, మెడిసిన్ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాల రేటు తగ్గిపోవడంతో పాటు, ఎక్కువ మంది పిల్లలు యుక్త వయస్సు వరకు, చాలా మంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగిస్తున్నారు. ఇకముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగడం కారణంగా 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండబోతోంది.
ఐక్యరాజ్యసమితి నివుదిక ప్రకారం జనాభాలో 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య 2022లో 10 శాతంగా ఉండగా, 2050 నాటికి 16 శాతానికి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..