కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనాలో పర్యటిస్తున్న నిపుణుల బృందం ఇన్వెస్టిగేషన్ అనుమానాస్పదంగా ఉందంటూ కొందరు విమర్శకులు చేసిన వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి కన్నా మీ వద్ద మరింత మెరుగైన సమాచారం ఉంటే దాన్ని తెలిపేందుకు ముందుకు రావాలని ఈ సంస్థ ఎమెర్జెన్సీస్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ కోరారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇలాంటివారు తెరవెనుక నుంచి ముందుకు వఛ్చి తమకు అందిన సమాచారాన్ని షేర్ చేసుకోవాలన్నారు. కోవిడ్ ఆరిజిన్ ని కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సుమారు 12 మంది నిపుణులు ప్రస్తుతం చైనాలోని వూహాన్ సిటీలో పర్యటిస్తున్నారు. అక్కడి సీ ఫుడ్ మార్కెట్ ని వారు ఇటీవల సందర్శించారు. ఈ మార్కెట్ లోని జంతువులు, సీ ఫుడ్ నుంచి ఈ వైరస్ మనుషులకు సోకిందని వార్తలు వఛ్చిన నేపథ్యంలో వారు చైనా శాస్త్రజ్ఞులతో దీనిపై చర్చిస్తున్నారు.
కానీ ఈ నిపుణులకన్నా ముందే తమకు కరోనా వైరస్ పుట్టుక గురించి తెలుసునంటూ కొంతమంది ప్రచారం చేసుకుంటున్నారని ర్యాన్ అన్నారు. నిపుణులు విడుదల చేసే నివేదికను తాము అంగీకరించబోమని వీరు అంటున్నారని, అసలు నివేదిక ఇంకా బయటికి రానిదే ఇలా ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. మీకు ఏయే సంస్థలనుంచి ఈ సమాచారం లభించిందో తెలియజేస్తే మరీ సంతోషం అని ర్యాన్ పేర్కొన్నారు.
మరిన్ని చదవండి:అమెరికాలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి.. చివరి చూపు కల్పించాలంటూ కుటుంబసభ్యులు ఆవేదన..
మరిన్ని చదవండి:విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !