సముద్రంలో మెలిస్సా హరికేన్ విశ్వరూపం.. గజగజ వణికిపోయిన జమైకా!

మెలిసా హరికేన్ మంగళవారం జమైకాను చుట్టేసింది. అదికూడా 295కిలోమీటర్ల వేగంతో జమైకా తీరాన్ని ఒక బ్లాస్ట్‌లా తాకింది. దాని విశ్వరూపానికి జమైకా రాజధాని కింగ్‌స్టన్ గజగజ వణికిపోయింది. గంటకు 295 కి.మీ వేగంతో వీచిన గాలులకు చెట్లు కూలి, కొండ చరియలు విరిగిపడి, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి.

సముద్రంలో మెలిస్సా హరికేన్ విశ్వరూపం.. గజగజ వణికిపోయిన జమైకా!
Cyclone Melissa

Updated on: Oct 29, 2025 | 11:23 PM

మొంథా ఎంత విధ్వంసం చేసిందో చూశాం. తెలుగురాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఊర్లను ముంచేసింది. పట్టణాలను జలమయం చేసింది. వేల ఎకరాల్లో పంటలను నాశనం చేసింది. ఇప్పటికీ మొంథా ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఇంత విధ్వంసం సృష్టించిన మొంథా వేగం 100కిలోమీటర్లే. కానీ దీనికి రెండింతలు అంటే 300కి.మీ వేగంతో దూసుకొస్తే, 100సెం.మీటర్ల మేర కుంభవృష్టి కురిపిస్తే తట్టుకోగలమా.. తట్టుకుని నిలబడగలమా.. నిలబడి కోలుకోగలమా..? ఇప్పుడు కరీబియన్ దీవుల్లో మోంథాకు మించిన తుఫాన్ దండయాత్ర చేస్తోంది.

మెలిసా హరికేన్ మంగళవారం జమైకాను చుట్టేసింది. అదికూడా 295కిలోమీటర్ల వేగంతో జమైకా తీరాన్ని ఒక బ్లాస్ట్‌లా తాకింది. దాని విశ్వరూపానికి జమైకా రాజధాని కింగ్‌స్టన్ గజగజ వణికిపోయింది. గంటకు 295 కి.మీ వేగంతో వీచిన గాలులకు చెట్లు కూలి, కొండ చరియలు విరిగిపడి, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సగం దేశానికి పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేటగిరీ 5 తుపానుగా ప్రకటించబడిన మెలిసా, జమైకా చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైనదిగా నిలిచింది. 174 ఏళ్ల రికార్డులను తిరగరాసిందీ మెలిస్సా హరికేన్.

మెలిసా ధాటికి జమైకా రాజధాని కింగ్‌స్టన్‌లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. మంగళవారం నాడు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. జమైకా చరిత్రలో ఎప్పడూ చూడని స్థాయిలో తీవ్ర ఆస్తి నష్టాన్ని చవిచూసింది. తుపాను ధాటికి తీరం వెంబడి 13 ఎత్తుల రాకాసి అలలు ఎగిసిపడ్డాయి. బుధవారం నాటికి జమైకాను చుట్టేసిన మెలిసా బుధవారం క్యూబాను చుట్టేసింది. కాకుంటే కాస్త తీవ్రత తగ్గింది. కేటగిరి 4గా నమోదంది. గాలి వేగం 250 కిలోమీటర్లు.

మెలిసా ధాటికి జమైకా, క్యూబాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యకలాపాలను నిలిపేశారు. విమానాశ్రయాలు, ప్రజారవాణా నిలిచిపోయింది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో..పలు నగరాల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబాలో 6లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబాతో పాటు బహమాస్, హైతీ, డొమినికన్‌ రిపబ్లికన్ ప్రాంతాల మీద తుపాను ప్రభావం అధికంగా ఉందని అక్కడి అధికారులు తెలిపారు.

ప్రస్తుతం మెలిస్సా క్యూబాను దాటింది. కేటగిరి 2 హరికెన్‌గా నమోదైంది. ప్రస్తుత గాలివేగం 165కిలోమీటర్లుగా ఉంది. మరోవైపు మెలిసా హరికేన్‌కు సంబంధించి అమెరికా కూడా అప్రమత్తమైంది. మియామీ తీరప్రాంతంపై హరికేన్ ప్రభావం తీవ్రంగా ఉంది. అయితే అగ్రరాజ్యం వైపు వెళ్లకుండా దిశ మార్చుకుని నెమ్మదిగా సోమవారం నాటికి బలహీన పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..