Pakistan Crisis: ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనం వెనుక అమెరికా హస్తం ఉందా?

Pakistan Crisis: ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పతనం వెనుక అమెరికా హస్తం ఉందా?
Imran Khan

342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాసం గెలిచింది. 174 మంది తీర్మానానికి మద్దతు పలికారు. పాకిస్తాన్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖానే!

Balu

| Edited By: Ram Naramaneni

Apr 10, 2022 | 2:11 PM

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌ అద్భుతమైన ఆల్‌రౌండర్‌. అంతకు మించిన కెప్టెన్‌. ఆయన సారథ్యంలోనే పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ను గెల్చుకోగలిగింది. అందుకే ప్రధానమంత్రి పదవి కోల్పోయిన తర్వాత క్రికెట్‌ పరిభాషలోనే క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారని, హిట్ వికెట్‌ అయ్యారేని, విపక్షాలు విసిరిన బౌన్సర్‌కు రిటైర్డ్‌హర్ట్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. 342 మంది సభ్యులున్న పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాల అవిశ్వాసం గెలిచింది. 174 మంది తీర్మానానికి మద్దతు పలికారు. పాకిస్తాన్‌ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖానే! పాకిస్తాన్‌లో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితి రావడానికి కారణం అమెరికానేనని ఇమ్రాన్‌ పదే పదే ఆరోపించారు. అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు కూడా అధికారపక్షం విదేశీ కుట్ర సంగతి ప్రస్తావించింది. ఆ అంశంపై ప్రసంగించింది. ఇమ్రాన్‌ పదవి పోవడానికి నిజంగానే అమెరికా(America) కారణమా? ఇమ్రాన్‌ చెబుతున్నది నిజమేనా? అంటే జరుగుతున్న పరిణామాలు నిజమేకాబోలు అని అనిపిస్తున్నాయి. క్రికెట్‌ నుంచి నిష్క్రమించిన తర్వాత ఇమ్రాన్‌ఖాన్‌ 1996లో పాకిస్తాన్‌ తెహరీక్‌ ఎ ఇన్సాఫ్‌ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. కానీ నవాజ్‌ షరీఫ్‌(Nawaz Sharif) సారథ్యంలో ఉన్న పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌పార్టీతో, బెనజీర్‌ భుట్లో నేతృత్వంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీతో నెట్టుకురాలేకపోయారు. ఎందుకంటే అప్పుడు పాక్‌ ప్రజలు ఈ రెండు పార్టీల వెన్నంటే ఉన్నారు. ఓసారి పీపీపీకి, మరోసారి పీఎంఎల్‌-ఎన్‌కు జనం పట్టం కట్టడం రివాజుగా మారిందక్కడ. నవాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కు అధినేతగా ఉన్న పెర్వేజ్‌ ముషారఫ్‌ కుట్ర పూరితంగా వ్యవహరించారు. సైన్యం మద్దతుతో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూల్చేసి పాలనా పగ్గాలను తను తీసుకున్నారు. ఇది జరిగింది 1998లో. దాదాపు పదేళ్ల పాటు ముషారఫ్‌ అధికారంలో ఉన్నారు. అప్పటికే జనం విసిగిపోయారు. నెమ్మదిగా ప్రజలలో అసంతృప్తి మొదలయ్యింది. ప్రజాగ్రహం పెల్లుబకముందే ముషారఫ్‌ జాగ్రత్తపడ్డారు. పదవి వదులుకోవడం ఇష్టంలేకపోయినా ఎన్నికలు జరపడానికి అంగీకరించారు. అప్పటికే దేశం వదిలి వెళ్లిపోయిన నవాజ్‌ షరీఫ్‌, బెనజీర్‌ భుట్టోలతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారు. వారి కోరిక మేరకు 2007లో నేషనల్‌ రికన్సిలేషన్ ఆర్డినెన్స్‌ను తెచ్చారు. ఆ రకంగా తమపై ఉన్న అవినీతి ఆరోపణల నుంచి విచారణకు మినహాయింపు తెచ్చుకున్నారు మాజీ ప్రధానులు.

విదేశాల్లో ఉంటున్న బెనజీర్‌ భుట్టో ఎన్నికల కోసమంటూ 2007లో స్వదేశానికి వచ్చారు. ఎన్నికల ర్యాలీలో ఉన్నప్పుడు బెనజీర్‌ హత్యకు గురయ్యారు. దాంతో ప్రజల్లో కొంత సానుభూతి వచ్చింది.. అది పీపీపీ విజయానికి దోహదపడింది. బెనజీర్‌ భుట్టో భర్త జర్దారీ అధ్యక్షుడయ్యారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. పాలకుల అవినీతిపై ఇమ్రాన్‌ దండెత్తారు. అవినీతి ఆరోపణలను బ్రహ్మాస్త్రంగా మలచుకున్నారు. నేషనల్ రికన్సిలేషన్‌ ఆర్డినెన్స్‌పై సందేహాలు లేవనెత్తారు. షరీఫ్‌, జర్దారీలు ఇద్దరూ ఇద్దరేనని, అవినీతి జలగలని విమర్శించసాగారు. తాను అధికారంలోకి వస్తే అవినీతి రహితమైన నయా పాకిస్తాన్‌ను నిర్మిస్తానంటూ ప్రజలకు వాగ్దానం చేశారు. నయా పాకిస్తాన్‌ నినాదాన్ని ప్రచారాస్ర్తంగా మలచుకున్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీకి 35 స్థానాలు వచ్చాయి.. ఇది గొప్ప విజయం కాకపోయినా ఇమ్రాన్‌కు మనో ధైర్యాన్న కలిగించింది. భవిష్యత్తు విజయంపై ఆశలు కలిగించింది. ఇమ్రాన్‌ తన నయా పాకిస్తాన్‌ నినాదాన్ని 2018 ఎన్నికల్లోనూ ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో పీటీఐ 149 స్థానాలను గెల్చుకుంది. ప్రభుత్వానికి అవసరమైన మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరమయ్యింది. మొత్తంగా ఇతర పార్టీల అండదండలతో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఆ ఎన్నికల్లో పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-ఎన్‌ పార్టీకి 82 స్థానాలు వస్తే పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీకి 54 స్థానాలు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు మొదటి నుంచి బద్ధ శత్రుత్వం ఉంది. అలాంటిది ఇప్పుడు పాత పగలన్నీ మర్చిపోయి స్నేహహస్తం చాచుకున్నాయి. రెండు పార్టీలు కలిసి పాకిస్తాన్‌ డెమెక్రాటిక్‌ మూవ్‌మెంట్‌ -పీడీఎంను ఏర్పాటు చేసుకున్నాయి. చిన్నా చితక పార్టీలు కూడా వీరితో చేతులు కలిపాయి. వీరి లక్ష్యమల్లా ఇమ్రాన్‌ను గద్దె దింపడమే. పీటీఐలోని కొందరిని కూడా తమవైపు తిప్పుకున్నాయి. అలా ఇమ్రాన్‌ ప్రభత్వాన్ని మైనారిటీలో పడేశాయి.

అవిశ్వాస తీర్మానంలో ఓటమి చవిచూసిన ఇమ్రాన్‌ గద్దె దిగక తప్పలేదు. పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ పార్టీ అధినేత షెహబాజ్‌ షరీఫ్‌ ప్రధానమంత్రి కావొచ్చు. ఈయన స్వయాన నవాజ్‌ షరీఫ్‌ తమ్ముడు. సరే రేపొద్దున్న షెహబాజ్‌ ప్రధానమంత్రి అయ్యారే అనుకుందాం! ఈయనకు పీపీపీ హృదయపూర్వకంగా మద్దతు ఇస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తే పోసుకునే పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీలు ఎలా కలిసి పని చేస్తాయి? ఇవాళ కాపోయినా రేపైనా అక్కడ రాజకీయ అస్థిరత అనివార్యమనిపిస్తోంది. ఇమ్రాన్‌ఖాన్‌ అవినీతికి పాల్పడ్డారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ అందుకు తగిన ఆధారాలను చూపలేకపోతున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వం పాకిస్తాన్‌ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని ఆరోపిస్తున్నాయి. రెండేళ్లలో ద్రవ్యోల్పణం 12 శాతానికి ఎగబాకిందని అంటున్నాయి. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నదని చెబుతున్నాయి. అందుకే ఇమ్రాన్‌ఖాన్‌ను పదవీచ్యుతుడిని చేయాల్సి వచ్చిందని విపక్షాలు వివరణ ఇచ్చుకున్నాయి. ఇమ్రాన్‌ఖాన్‌ గద్దెనెక్కకముందు పాకిస్తాన్‌ ఆర్ధిక పరిస్థితి ఏమైనా బలంగా ఉండిందా? అంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితులు ఉండేవి.. అప్పులు లేవా? అంటే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.. అది కాకుండా కరోనా కారణంగా ప్రపంచంలోని చాలా దేశాల ఆర్ధిక పరిస్థితి అతలా కుతలమయ్యాయి. ఆ లిస్టులో పాకిస్తాన్‌ కూడా ఉంది. ఇవన్నీ విపక్ష పార్టీలకు తెలియనివి కావు.. మరి ఇంత హఠాత్తుగా ఇమ్రాన్‌ను ఎందుకు గద్దెదింపాల్సి వచ్చింది? కారణాలు ఏమై ఉంటాయి? నిజానికి పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బాజ్వాతో ఇమ్రాన్‌కు విభేదాలు వచ్చాయన్న వార్తలు బయటకు రావడంతోనే విపక్షాలు తమ వ్యూహాలను పదును పెట్టాయి. అదే సమయంలో సైన్యం ఇమ్రాన్‌ను పదవిలోంచి దించేయాలని అనుకుంది. కాకపోతే అప్పుడు పాక్‌ సైన్యానికి అమెరికా సపోర్ట్‌ లభించలేదు. అందుకే సైలెంటయ్యింది.. ఇప్పుడు ఇమ్రాన్‌ అంటే అమెరికాకు అస్సలు పడటం లేదు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా తనను ఇమ్రాన్‌ ఖాతరు చేయకపోవడంతో అమెరికా అహం దెబ్బతింది. అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత పాక్‌లో ఓ సైనిక స్థావరం పెట్టుకుంటామని నిరుడు ఆగస్టులో పాక్‌ ప్రభుత్వాన్ని కోరింది.. అమెరికా కోరికు ఇమ్రాన్‌ తోసిపుచ్చారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇమ్రాన్‌ఖాన్‌ అనేక సార్లు అమెరికాను గట్టిగా విమర్శించారు. దాన్ని అమెరికా మనసులో పెట్టుకుంది. నెమ్మదిగా పాక్‌ సైన్యాన్ని మచ్చిక చేసుకోవడం మొదలు పెట్టింది. అదీ కాకుండా ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడిని ఇమ్రాన్‌ ఖండిస్తారని అమెరికా ఆశించింది. అందుకు విరుద్ధంగా ఇమ్రాన్‌ రష్యాకు సపోర్టిచ్చాడు. పైగా దాడి మొదలైన ఫిబ్రవరి 24న మాస్కోకు కూడా వెళ్లారు. ఇది అమెరికాకు పుండు మీద కారం చల్లినట్టయ్యింది. వెంటనే ఇమ్రాన్‌ను పదవీభ్రష్టుడిని చేయమంటూ సైన్యాన్ని ఆదేశించింది. అమెరికా రంగంలోకి దిగడంతో విపక్షాలకు కూడా కాస్త బలం వచ్చింది.. వెరసి ఇమ్రాన్ గద్దె దిగాల్సి వచ్చింది. ఇమ్రాన్‌ చేస్తున్న విదేశీ కుట్ర ఆరోపణల్లో నిజం ఉందనడానికి ఈ పరిణామాలే రుజువు. నిజానికి పాకిస్తాన్‌ పుట్టినప్పట్నుంచి సైన్యం, అమెరికా కలిసి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన పాలకులను ఇష్టారాజ్యంగా మార్చివేశాయి. ఇవన్నీ చూస్తుంటే ఇమ్రాన్‌ ప్రభుత్వం పతనం వెనుక అమెరికా పరోక్ష సహకారం ఉందనే అనిపిస్తోంది..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu