
చర్చలంటే ఎలా ఉండాలి. ఉభయకుశలోపరిలా ఉండాలి. పెద్దరికం తీసుకున్న వ్యక్తి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయంతో సంతృప్తి పరచాలి. కానీ రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ట్రంప్ ఎపిసోడ్‌లో వన్‌సైడ్ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ఆపాలంటే త్యాగం చేయాలి. అది ఉక్రెయిన్ మాత్రమే చేయాలి.. అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకూ ట్రంప్ ఉక్రెయిన్ ముందుంచిన ఆప్షన్స్ ఏంటి.? దానికి ఉక్రెయిన్ ఓకే ఆదేశానికి నష్టమా..? లాభమా ? తెలుసుకుందాం.
రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో చర్చలు జరిపారు. త్వరలో పుతిన్-జెలన్‌స్కీ ఫేస్ టు ఫేస్ కూడా కూర్చోబోతున్నారు. కానీ అలా ముఖాముఖి భేటీకి ముందు ఉక్రెయిన్ ముందు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి వేదిక ఇంకా ఖరారు కాలేదు. అయితే, వైట్ హౌస్ బుడాపెస్ట్ పై దృష్టి సారించింది. బుడాపెస్ట్ హంగేరి రాజధాని. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశాన్ని వైట్ హౌస్ ప్లాన్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడి మొదటి పదవీకాలం నుండి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు దగ్గరగా ఉన్న ప్రధాన మంత్రి విక్టర్ ఓర్బన్ నాయకత్వంలో మధ్య యూరోపియన్ దేశంలో శిఖరాగ్ర సమావేశానికి యుఎస్ సీక్రెట్ సర్వీస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
మరోవైపు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మధ్య ప్రత్యక్ష శాంతి చర్చలలో పురోగతి ఉంటుందనే అంచనాలను తగ్గించడానికి మాస్కో మంగళవారం(ఆగస్టు 19) ప్రయత్నించింది. పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ కాల్ తర్వాత ఊహాగానాలు పెరిగాయి. పొలిటికో ప్రకారం, రష్యాలో జరిగే వన్-టు-వన్ సమావేశానికి జెలెన్స్కీని ఆతిథ్యం ఇవ్వాలని పుతిన్ క్లుప్తంగా సూచించారు. సోమవారం జెలెన్‌స్కీ అనేక మంది యూరోపియన్ నాయకులతోపాటు ట్రంప్‌తో సమావేశాల కోసం వైట్ హౌస్‌లో ఉన్నప్పుడు ఈ పిలుపు వచ్చింది. కానీ ఈ మార్పిడి వివరాలను ఖండించలేదు.. తిరస్కరించలేదని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి.
ఓ రకంగా ట్రంప్ రాయబారం జెలెన్‌స్కీకు ఝలక్ ఇచ్చిందనే అంటున్నారు విశ్లేషకులు. మ్యాప్ ప్రకారం సగం ఉక్రెయిన్ రష్యాకు ఇవ్వాలని ట్రంప్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆ ప్రతిపాదన ప్రకారం డాన్‌బాస్ ప్రాంతాలు పూర్తిగా రష్యా చేతికి వెళ్తాయి. దీంతో ఉక్రెయిన్ భూభాగం ఇరవై శాతం కోల్పోవాల్సి ఉంటుంది. ప్రతిగా రష్యా రెండు ప్రాంతాలు ఇస్తుందని ప్రతిపాదన వచ్చింది. ప్రస్తుతం ల్యాండ్ స్వాప్ ఆలోచనలు చర్చలో ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్‌కు తాము పూర్తి రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారు.
సమస్య పరిష్కారానికి త్రైపాక్షిక భేటీ జరపనున్నట్లు వెల్లడించారు. దానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా సమ్మతి తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియబోతోందని, అయితే అది ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేనంటున్నారు ట్రంప్. అంతేకాదు జెలెన్‌స్కీతో చర్చలకు ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 12 సంవత్సరాల క్రితం రష్యా ఆక్రమించిన క్రిమియాను ఉక్రెయిన్ మరిచిపోవాలని.. నాటోలో ప్రవేశించాలన్న ఆకాంక్షనూ వదులుకోవాలంటూ తన ట్రూత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు డొనాల్డ్ ట్రంప్.
డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్‌క్, లుహాన్స్‌క్‌పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్‌స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవి ఇచ్చి వేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్‌స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం(ఆగస్టు18) ముఖాముఖి భేటీలో పుతిన్ ప్రతిపాదనలకు సంబంధించిన మ్యాప్‌ను కూడా ప్రదర్శించింది. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్‌ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారవచ్చనేది జెలెన్‌స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.
ట్రంప్ శాంతి ఒప్పందం అసమానంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనలు ఒకరికి మాత్రమే ఫేవర్‌గా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు ఉక్రెయిన్ ప్రతినిధులు.దీనికి ఉక్రెయిన్ ప్రజలు వ్యతిరేకిస్తారని.. ట్రంప్ మధ్యవర్తిత్వం పక్షపాతంగా ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ల్యాండ్ స్వాప్ సాధ్యమా.. ఉక్రెయిన్ దృఢంగా నిలబడుతుందా అన్న చర్చ జరుగుతోంది అంతర్జాతీయంగా. అసలు ఇన్నాళ్లూ ఆ ప్రదేశాల కోసమే ఉక్రెయిన్ యుద్ధం చేస్తూ వస్తోంది. మరి శాంతి కోసం జెలెన్‌స్కీ త్యాగం చేస్తారా..? అసలు లక్ష్యం దెబ్బతినకుండా యుద్ధం కొనసాగిస్తారా అన్న చర్చ జరుగుతోంది.
నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ పోరాడుతున్నా.. అది సాధ్యం కాదని ట్రంప్ తేల్చేశారు. మరి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పుతిన్ ప్రతిపాదనలు తిరస్కరిస్తే, యుద్ధం కొనసాగుతుందని, ట్రంప్ శాంతి ప్రయత్నం విఫలమైనట్లేనన్న ఆందోళన అమెరికాలోనూ వ్యక్తమవుతోంది. నయానో బయానో ఉక్రెయిన్‌ను ఒప్పించాలన్న పట్టుదలతో ట్రంప్ ఉన్నారు. అంతేకాదు మరో రెండురోజుల్లో జరగబోయే త్రైమాక్షిక చర్చల్లోనూ ల్యాండ్ స్వాపే కీలకం. మరి ఈవిషయంలో ఉక్రెయిన్ డెసిషన్ ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..