Virgin Galactic: స్పేస్‌లోకి దూసుకుపోవాలని ఉందా? నింగి నుంచి నేలను చూడాలని ఉందా? అయితే అద్భుతమైన అవకాశం సొంతం చేసుకోవచ్చు. అంతరిక్షంలోకి వెళ్లేందుకు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ బుకింగ్‌ను వర్జిన్ గెలాక్టిక్ ప్రారంభించింది. కానీ టికెట్ విలువ ఎంతో తెలిస్తే షాకవుతారు. అక్షరాల సుమారు 33 కోట్లు. బ్రిటన్ బిజినెస్ మెన్ సర్ రిచర్డ్ బ్రాన్సన్, ప్రముఖ ఆన్‌లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ బృందం అంతరిక్ష యానాన్ని విజయవంతంగా ముగించుకొని వచ్చిన తరువాత స్పేస్ టూరిజంపై ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు. నింగిలోకి దూసుకెళ్లి అక్కడి నుంచి భూమిని చూడాలన్న ఉత్సాహం అందరిలో ఉంటుంది. కానీ కొందరి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే అంతరిక్ష ప్రయాణం చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే సామాన్య మానవుడికి అందని ద్రాక్షే అని చెప్పాలి. అంతరిక్షయానం చేయాలంటే సుమారు 33 కోట్ల రూపాయలకు పై మాటే అంటోంది వర్జిన్ గెలాక్టిక్. తమ స్పేస్ షిప్‌లో సీటు రిజర్వ్ చేసుకోవాలని పిలుపునిస్తోంది. తాజాగా ఈ విషయాన్ని బ్రిటన్ బిలియనీర్ స్పేస్ షిప్ కంపెనీ వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్ ప్రకటించారు. చరిత్రాత్మక అంతరిక్ష యాత్ర సక్సెస్‌ఫుల్‌గా ముగించుకున్న కొన్ని వారాల తర్వాత స్పేస్ విమాన టికెట్ల విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే ఈ విమానంలో సీటు దక్కించుకోవాలంటే 450,000 (సుమారు రూ.33,382,682) డాలర్లు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇందుకు మూడు ప్యాకేజీలను కూడా ప్రకటించింది. సింగిల్ సీట్, మల్టీ-సీట్ ప్యాకేజీ, ఫుల్ ఫ్లైట్ బై అవుట్ ఆఫర్లు ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. వచ్చే సంవత్సరం రెవెన్యూ విమానాలను ప్రారంభించే దిశగా పురోగతి సాధిస్తున్నట్లు స్పేస్-టూరిజం కంపెనీ గురువారం వెల్లడించింది. వర్జిన్ గెలాక్టిక్ తదుపరి అంతరిక్ష ప్రయాణం సెప్టెంబర్ చివరలో ఉండనుందని అంచనా. తాజా ప్రకటనతో కంపెనీ షేర్లు 5 శాతం దూసుకెళ్లడం విశేషం. ఈ ఏడాది జూన్‌లో వర్జిన్ గెలాక్టిక్ ప్రజలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు యుఎస్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ నుండి వర్జిన్ గెలాక్టిక్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.