
జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌లో 271 మంది ప్రయాణికులు, సిబ్బందితో వియత్నాంకు బయలుదేరిన విమానంలో సెకన్ల వ్యవధిలో ఊహించని విపత్తు విరుచుకుపడింది. టేకాఫ్ అవుతున్న సమయంలో గుండెలు ఆగిపోయే ఘోర ప్రమాదం ఎదురైంది. విమానం రన్‌వేపై పూర్తి వేగంతో పరిగెడుతోంది. రన్‌వే సగం పూర్తి కాగానే విమానం వేగం హఠాత్తుగా రెండు సెకన్ల పాటు ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ వేగం పుంజుకుంది. ఆ మరుక్షణమే విమానం వేగం రెండోసారి పడిపోయింది! ముందు చూస్తే రన్‌వే కేవలం 91 మీటర్లు మాత్రమే మిగిలి ఉంది. అంత తక్కువ దూరంలో విమానాన్ని అత్యవసరంగా ఆపడం అసాధ్యం. ఏమాత్రం ఆలస్యం చేసినా విమానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దాంతో అనుభవజ్ఞులైన పైలట్లు క్షణం కూడా ఆలోచించకుండా ఇంజిన్ల శక్తిని గరిష్ట స్థాయికి పెంచి, విమానాన్ని గాల్లోకి పైకి లేపారు.
విమానం అత్యంత వేగంగా గాల్లోకి లేవడంతో దాని వెనుక భాగం రన్‌వే నేలను బలంగా తాకింది. దానికి తోడు చక్రాలకు ఉన్న నాలుగు ప్రధాన టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. భారీ శబ్దంతో రన్‌వేపై నుంచి ధూళి, పొగలు ఎగిసిపడ్డాయి. ఏదో ముప్పు జరిగిందని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
గాల్లోకి లేచిన వెంటనే విమానం కాక్‌పిట్‌లో టైర్ ప్రెజర్ తగ్గినట్లు, టెయిల్ స్ట్రైక్ జరిగినట్లు వార్నింగ్ అలారాలు మోగాయి. వెంటనే పైలట్లు మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అయితే, ట్యాంకులలో నిండిన ఇంధనంతో దెబ్బతిన్న టైర్లపై ల్యాండింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. అందుకే పైలట్లు విమానాన్ని మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ 9,000 అడుగుల ఎత్తులో సుమారు రెండు గంటల పాటు తిప్పుతూ, ఇంధనాన్ని ఖాళీ చేశారు. లోపల ఉన్న 271 మంది ప్రయాణికులు కిటికీల గుండా ఇంధనం కిందకు పోవడం చూస్తూ ప్రతి సెకనూ నరకం చూశారు.
అవసరమైనంత ఇంధనం ఖాళీ అయిన తర్వాత పైలట్లు ఎంతో చాకచక్యంగా విమానాన్ని మ్యూనిచ్ రన్‌వేపై సురక్షితంగా దించారు. ల్యాండింగ్ సమయంలో టైర్లు లేకపోవడంతో రన్‌వేపై విపరీతమైన రాపిడి జరిగి పొగలు వచ్చాయి. అదృష్టవశాత్తూ 271 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. విమానం వెనుక భాగం తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని తనిఖీల కోసం నిలిపివేశారు. అసలు టేకాఫ్ సమయంలో విమానం వేగం రెండుసార్లు ఎందుకు తగ్గింది అనే కోణంలో జర్మనీ ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు