ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందు నిషేధం దిశగా అడుగులు.. తెలంగాణ బాటలోనే అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రం!

మానవ ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన ప్రమాదకరమైన 'పారాక్వాట్' (Paraquat) గడ్డిమందును ప్రపంచవ్యాప్తంగా నిషేధించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రం ఈ గడ్డిమందుపై పూర్తి నిషేధం విధిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్‌ను శాశ్వతంగా నిషేధిస్తూ వర్మాంట్ అసెంబ్లీ ఏకంగా ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. తద్వారా, అమెరికాలోనే ఈ రసాయన కలుపు సంహారకాన్ని చట్టబద్ధంగా నిషేధించిన మొదటి రాష్ట్రంగా వర్మాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది.

ప్రపంచవ్యాప్తంగా గడ్డిమందు నిషేధం దిశగా అడుగులు.. తెలంగాణ బాటలోనే అగ్రరాజ్యం అమెరికా రాష్ట్రం!
Vermont Paraquat Ban

Updated on: Jun 25, 2026 | 9:39 PM

మానవ ప్రాణాలకు, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా పరిణమించిన ప్రమాదకరమైన ‘పారాక్వాట్’ (Paraquat) గడ్డిమందును ప్రపంచవ్యాప్తంగా నిషేధించే ప్రక్రియ మరింత వేగవంతమైంది. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాలోని వర్మాంట్ రాష్ట్రం ఈ గడ్డిమందుపై పూర్తి నిషేధం విధిస్తూ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్‌ను శాశ్వతంగా నిషేధిస్తూ వర్మాంట్ అసెంబ్లీ ఏకంగా ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. తద్వారా, అమెరికాలోనే ఈ రసాయన కలుపు సంహారకాన్ని చట్టబద్ధంగా నిషేధించిన మొదటి రాష్ట్రంగా వర్మాంట్ సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ గడ్డిమందు వాడకం వల్ల మనుషులలో తీవ్రమైన నరాల బలహీనత వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని వర్మాంట్ ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. అయితే, పారాక్వాట్ నిషేధం వల్ల కలుపుతీత ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, ప్రత్యామ్నాయాలు ఖరీదైనవని అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, రైతుల ఆర్థిక లాభాల కంటే ప్రజారోగ్యం, మనుషుల ప్రాణాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసిన వర్మాంట్ పాలకవర్గం.. కలుపు నివారణకు ఇతర సురక్షిత ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రైతులకు సూచించింది.

పారాక్వాట్ అనేది అత్యంత విషపూరితమైన రసాయనం. ఇది చాలా తక్కువ పరిమాణంలో శరీరంలోకి ప్రవేశించినా అంతర్గత అవయవాలు దెబ్బతిని ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా, గ్రామీణ ప్రాంతాల్లో క్షణికావేశంలో దీనిని తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలు ఈ గడ్డిమందుపై పూర్తిగా నిషేధం విధించాయి.

భారతదేశంలోనూ ఈ ప్రమాదకర రసాయనాన్ని బ్యాన్ చేయాలని పలు స్వచ్ఛంద సంస్థలు సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో గడ్డిమందు బ్యాన్ దిశగా కొన్ని రాష్ట్రాలు ముందడుగు వేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం దృష్ట్యా తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండు నెలల క్రితమే రాష్ట్రంలో పారాక్వాట్ గడ్డిమందు విక్రయాలు, వాడకంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా అమెరికా రాష్ట్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్‌లో పారాక్వాట్ అంతర్థానానికి రోజులు దగ్గరపడ్డాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us