ఇరాన్‌పై అమెరికా భీకర దాడి.. మూడు అణు కేంద్రాలపై బాంబుల వర్షం! ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంది. ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడి విజయవంతమైందని ట్రంప్ ప్రకటించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇరాన్‌పై అమెరికా భీకర దాడి.. మూడు అణు కేంద్రాలపై బాంబుల వర్షం! ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా..?
Us Attacks Iran

Updated on: Jun 22, 2025 | 6:37 AM

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధంలో ఇప్పుడు అధికారికంగా అమెరికా కూడా వచ్చి చేరింది. ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలపై తమ ఫైటర్‌ జెట్లతో భీకర దాడి చేసింది. ఇరాన్‌పై దాడి చేసి ఫైటర్‌ జెట్లు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్ మూడు అణు కేంద్రాలపై తాము విజయవంతమైన దాడిని పూర్తి చేసాం అని ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియాలో వెల్లడించారు. ″అన్ని విమానాలు సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నాయి. మన గొప్ప అమెరికన్ వారియర్లకు అభినందనలు. ప్రపంచంలో మరే సైన్యం ఇలా చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం!” అని ట్రంప్‌ పేర్కొన్నారు. శనివారం రాత్రి 10 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తానని ట్రంప్ అన్నారు.

అయితే ఇటీవలె ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం దౌత్యపరంగా పరిష్కారం అవ్వడానికి అమెరికా రెండు వారాలు టైమ్‌ ఇస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్‌.. అంతలోనే ఆ మాట చెప్పిన 48 గంటలలోపే ఇరాన్‌పై భీకర దాడికి దిగారు. ″సమీప భవిష్యత్తులో ఇరాన్‌తో చర్చలు జరిగే అవకాశం ఉండటంతో, రాబోయే రెండు వారాల్లోపు వెళ్లాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటాను” అని ట్రంప్ గురువారం వైట్ హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కానీ, ఇప్పుడు డైరెక్ట్‌గా ఇరాన్‌పై దాడికి దిగారు. అమెరికా తమపై దాడి చేస్తే.. తాము కచ్చితంగా తిరిగి ప్రతి దాడి చేస్తామని, అమెరికా ఊహించలేని నష్టాన్ని చూపిస్తామని ఇప్పటికే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ ఇటీవల అన్నారు.

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ వివాదంలో ఇప్పుడు అమెరికా ఎంటర్‌ అవ్వడంతో.. కచ్చితంగా ఇతర పెద్ద దేశాలైన రష్యా, చైనా కూడా ఈ యుద్ధంలోకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎంటర్‌ అయ్యే అవకాశం ఉంది. ఒక వేళ అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి