అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఈ కాల్పుల్లో నిందితుడు సహా తొమ్మిది మంది మరణించారు. ఇక ఈ కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి కూడా మరణించడం ఉలక్కిపడేలా చేసింది. చనిపోయిన యువతి హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్యగా గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్జి జిల్లా జడ్జి నర్సిరెడ్డి అని నిర్ధారణ అయ్యింది. చనిపోయిన యువతిని పాస్‌పోస్ట్, వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యగా గుర్తించారు.
ఐశ్యర్య మృత దేహాన్ని మంగళవారం అమెరికాలోని రెహమా ఫ్యునరల్ సెంటర్‌కి తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యునరల్ సెంటర్‌లోనే డెడ్‌బాడీని భారత్‌కు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రక్రియ తర్వాత తానా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఇదిలా ఉంటే 27 ఏళ్ల వయసున్న ఐశ్వర్య.. అమెరికాలోని పర్‌ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ అనే కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా చేస్తోంది. ఈ నెల 6వ తేదీ రాత్రి ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన కాల్పుల తర్వాత ఆమె నుంచి ఎలాంటి కాంటాక్ట్ తల్లిదండ్రులకు లేకుండాపోయింది.
దీంతో కీడు శంకించిన జడ్జి నర్సిరెడ్డి టెక్సాస్‌లోని తానా ప్రతినిధులను సంప్రదించారు. ఐశ్వర్య జాడ తెలుసుకోవాలని కోరారు. ఐశ్వర్యకు సంబంధించిన విషయాన్ని తెలుసుకునేందుకు తానా సభ్యుడు అశోక్ కొల్లాను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి FBIతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. తీరా చూస్తే ఐశ్వర్య చనిపోయినట్లు ఎఫ్‌బీఐ తాజాగా ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..