
అటు అమెరికా .. ఇటు రష్యా మధ్యలో నలిపోతున్నారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ., అమెరికా పర్యటనలో చేదు అనుభవంతో వెనుదిరిగిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ లండన్ చేరుకున్నారు. లండన్‌లో ఈయూ సమ్మిట్‌కు జెలెన్‌స్కీ హాజరవుతున్నారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో గొడవ కారణంగా కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు జెలెన్‌స్కీ.
అయితే లండన్ చేరుకున్న తరువాత కాస్త మెత్తబడ్డారు జెలెన్‌స్కీ. అమెరికా తమకు ఎప్పటికి మిత్రదేశమే అన్నారు. పుతిన్ నుంచి రక్షణ కల్పిస్తే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్దమన్నారు. పుతిన్ విషయంలో అమెరికా గ్యారంటీ ఇస్తే వెంటనే సంతకం చేస్తామన్నారు. ట్రంప్‌తో తనతో వ్యవహించిన తీరు బాగాలేదన్నారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య.. వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌజ్‌లో జరిగిన భేటీ వాగ్వాదానికి దారి తీసింది. కీలకమైన ఖనిజ ఒప్పందంపై సంతకం చేయకుండానే.. వైట్‌హౌస్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఓవల్ ఆఫీసులో ట్రంప్, జెలెన్‌స్కీ మీడియా ముందే చిర్రుబురులాడుకున్నారు. రూమ్ అంతా నిండిన మీడియా ముందే ఆ ఇద్దరు నేతలు మాటల యుద్ధం కొనసాగింది. ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని.. జెలెన్ స్కీని “స్టుపిడ్ ప్రెసిడెంట్” అంటూ మండిపడ్డారు. ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంతో ఖనిజాల తవ్వకం ఒప్పందం నిలిచిపోయింది.
ట్రంప్‌తో గొడవ తరువాత ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీని హీరోగా చూస్తున్నారు. అగ్రరాజ్యాన్ని ఎదిరించిన మొనగాడిగా కీర్తిస్తున్నారు. అయితే అమెరికా హ్యాండ్ ఇవ్వడంతో తమ దేశ భవితవ్యం ఏమవుతుందన్న ఆందోళన ఉక్రెయిన్ ప్రజల్లో నెలకొంది. ట్రంప్‌తో జెలెన్‌స్కీ చర్చలు విఫలమైన తరువాత రష్యా మరింత రెచ్చిపోయింది. ఒకేసారి 200 డ్రోన్లను ప్రయోగించింది. కాకపోతే ఉక్రెయిన్‌కు యూరోపియన్ దేశాలతో పాటు కెనడా మద్దతు ప్రకటించడం జెలెన్‌స్కీకి కాస్త ఊరట కలిగించే విషయంగా చెప్పుకోవాలి. జెలెన్‌స్కీకి మద్దతిచ్చే దేశాలు మూడో ప్రపంచ యుద్దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అర్ధం చేసుకోవాలని రష్యా ప్రకటించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..