Russia Ukraine War: రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. 13 రోజులుగా రష్యా.. ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ తరుణంలో మూడు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమవ్వడంతో ఇరు దేశాలు కూడా ఒకరినొకరు దాడులను తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ (Volodymyr Zelensky) కీలక ప్రకటన చేశారు. తాను కీవ్‌లోనే ఉన్నానని, అజ్ఞాతంలో లేనంటూ స్పష్టంచేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జెలెన్‌స్కీ ఈ ప్రకటన చేశారు. తాను కీవ్‌లోని తన కార్యాలయంలోనే ఉన్నానని.. దేశం విడిచి వెళ్లలేదంటూ స్పష్టంచేశారు. సోమవారం అర్ధరాత్రి తన ఫేస్‌బుక్‌లో పేజీలో మాట్లాడుతూ… కార్యాలయం చుట్టుపక్కల దృశ్యాలను జెలెన్‌స్కీ చూపించారు. కీవ్‌లోని బాంకోవ స్ట్రీట్‌లో ఉన్నానని.. ఇందులో ఎలాంటి దాపరికం లేదంటూ పేర్కొన్నారు. తాను ఎవరికీ భయపడనని.. దేశభక్తి సంబంధించిన ఈ పోరాటంలో విజయం సాధించేంత వరకూ భయపడేది లేదంటూ జెలెన్‌స్కీ మరోసారి పునరుద్ఘాటించారు.
ఉక్రేయిన్ – రష్యా ప్రతినిధుల మధ్య మూడో దఫా శాంతి చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చర్చలు ముగిసిన కొన్ని గంటల తర్వాత జెలెన్‌స్కీ (Zelenksy) ఈ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా.. ఈ శాంతి చర్చలు బెలారస్-పోలాండ్ సరిహద్దులోని బెలోవెజ్‌స్కాయా పుష్చాలో దాదాపు మూడు గంటలపాటు కొనసాగాయి. ఇదిలాఉంటే.. తమ షరతులకు ఉక్రెయిన్ ఒప్పుకుంటే.. సైనిక చర్యలను వెంటనే నిలుపుతామంటూ రష్యా ప్రతినిధి చర్చలకు ముందు పేర్కొన్నారు. కాగా.. సైనిక చర్య మంగళవారంతో 13వ రోజుకు చేరింది. అయితే.. పలు నగరాల్లో పౌరులను బయటకు తరలించేందుకు రష్యా దాడులకు తాత్కాలిక విరామం ప్రకటించింది.
Also Read: