ఈ బామ్మ డేర్ చూశారా..? రష్యా డ్రోన్‌కు సెకన్లలో ఎలా చెక్ పెట్టిందో..
ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియాకు చెందిన ఓ వృద్ధ మహిళ.. ఓ డ్రోన్‌ను నిర్వీర్యం చేసింది. క్షణాల వ్యవధిలోనే ఆపరేటర్‌తో డ్రోన్‌కు ఉన్న సంబంధాన్ని ఆమె తెంచేసింది. వీడియోలో ఆ మహిళ కిందపడిపోయిన డ్రోన్ దగ్గరకు వెళ్లి, ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్‌ను తొలగించింది. ఆ కేబుల్‌ను డిస్‌కనెక్ట్ చేయడం ద్వారా, ఆ పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించే కనెక్షన్‌ను ఆమె తెంపేసింది.

ఆ మహిళ డ్రోన్ బ్యాటరీని కూడా పనికిరాకుండా చేసింది. రష్యా ఆపరేటర్ ఒకరు రికార్డు చేసినట్లుగా భావిస్తున్న ఈ వీడియో సెప్టెంబర్ 15, 2026న విడుదలైంది. ఏ మాత్రం కంగారుపడకుండా, ప్రశాంతంగా, వేగంగా ఆమె వ్యవహరించిన తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ మహిళ డ్రోన్ ను నిర్వీర్యం చేయడం చూస్తుంటే ..శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యులలో కనిపించే కచ్చితత్వం ఆమెలో కనిపించిందని ఒకరు వ్యాఖ్యానించారు. అయితే ఆ పరికరం దగ్గరకు వెళ్లడం ద్వారా ఆ వృద్ధ మహిళ తన ప్రాణాలను రిస్క్ లో పడేసిందని మరొకరు రాసుకొచ్చారు.
రష్యాకు చెందిన ఫైబర్-ఆప్టిక్ ఎఫ్‌పీవీ డ్రోన్లు.. డ్రోన్‌కు, ఆపరేటర్‌కు మధ్య చిత్రాలు (ఇమేజెస్), ఆదేశాలను ప్రసారం చేయడానికి భౌతిక కేబుల్‌ను (తీగను) ఉపయోగిస్తాయి. వైర్‌లెస్ కమ్యూనికేషన్స్‌లో ఉండే కొన్ని పరిమితులను అధిగమించి పనిచేయడానికి ఈ సాంకేతికత దోహదపడుతుంది.
నిపుణుల హెచ్చరిక ప్రాణాలకు ప్రమాదం
యుద్ధ పరిస్థితులలో సామాన్య ప్రజలలో అంతర్లీనంగా ఉండే హీరోయిజం బయటపడిన సందర్భాలు ఉన్నాయి. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ దగ్గరకు ధైర్యంగా వెళ్లిన ఆ బామ్మ.. దాన్ని నేలకేసి కొట్టి, విడదీసి ఎందుకు పనికిరాకుండా చేసింది. అయితే అలాంటి డ్రోన్‌ల దగ్గరకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆ పరికరంలో ఇంకా పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉందని, వాటిని భౌతికంగా కదిలించడం లేదా తాకడం వల్ల మంటలు చెలరేగి, భారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉందని వారంటున్నారు. సో… ఈ బామ్మ లక్కీ అన్నమాట! బామ్మ ధైర్యం మెచ్చుకోదగ్గదే అయినా, ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అందుకే ఆమె చాలా అదృష్టవంతురాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
2022 ఫిబ్రవరిలో మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 5 లక్షల మంది రష్యా సైనికులు మరణించారు. అంతేకాకుండా, రష్యా సైన్యం భారీగా ఆస్తులను కూడా కోల్పోయింది. భారీ నష్టాల కారణంగానే ఇటీవలి కాలంలో ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దూకుడు చాలా వరకు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ శుక్రవారం జరిగిన డ్రోన్ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు