భారీ వర్షాలు కురిసి వరద వస్తే ఎలాంటి జలప్రళయం ఏర్పడుతుందో కళ్లారా చూశాం. ప్రకృతి ప్రకోపించి మిన్ను విరిగి వెన్ను మీద పడ్డట్టుగా తుఫాన్ బీభత్సం సృష్టిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మయన్మార్ దేశాన్ని చూస్తే తెలుస్తుంది. యాగీ తుఫాన్ మయన్మార్‌లో చేసిన బీభత్సం చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరించడం ఖాయం. ప్రచండ గాలులు..కుండపోత వానలు..ఉప్పొంగిన వరదలు మయన్మార్‌ను అతలాకుతలం చేశాయి. కొండ చెరియలు విరిగి పడ్డాయి. ఈ విధ్వంసంలో దాదాపు 236మంది చనిపోయారు.. ఇది అధికారిక లెక్క మాత్రమే. చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వందల మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని పేర్కొంది ఐక్య రాజ్య సమితి.
యాగీ తుఫాన్ తీవ్రత ఆ స్థాయిలో ఉంది. వరదల్లో ఇల్లు-వాకిలి తుడిచి పెట్టుకుపోవడంతో లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సహాయక కేంద్రాలకు వెళ్లారు. అంచనాలకు కూడా అందనంతగా పంట నష్టం.. ఆస్తి నష్టం జరిగింది. బతికి బయటపడే దారిలేక ఎంతో మంది విలవిల్లాడుతున్నారు.. ఆకలితో అలమటిస్తున్నారు. సహాయక చర్యల కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.
మయన్మార్ లో ఎన్నోసార్లు జలప్రళయం కరాళ నృత్యం చేసింది. కానీ ఇంతటి భీభత్సాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. యాగి తుఫాన్ చేసిన ఈ జలవిధ్వంసం మయన్మార్ చర్రితలోనే అత్యంత పెను విపత్తు. ఇప్పటికే అంతర్యుద్ధంతో సతమవుతున్న మయన్మార్‌కు యాగి తుఫాన్ కోలుకోలేనంతగా నష్టాన్ని కష్టాన్ని తెచ్చి పెట్టింది.. రాజధాని నేపిడావ్ సహా అనేక ప్రాంతాలు వరదకు ఎదురీదుతున్నాయి. గుక్కెడు మంచినీళ్లు కూడా లేక బాధితులు తల్లడిల్లుతున్నారు. రోడ్లు తుడిచి పెట్టుకుపోవడంతో సహాయక చర్యలు విఘాతం కలుగుతోంది. ఆదుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటోంది మయన్మార్.
యాగీ తుఫాన్ ఒక్క మయన్మార్‌లో మాత్రమే కాదు వియత్నాం, థాయ్‌లాండ్, లావోస్‌లో కూడా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. వందల మంది జలసమాధి అయ్యారు. వరద బాధితులను ఆదుకునేందుకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఆపరేషన్ సద్భవ్‌ను చేపట్టింది . ఆహారం, తాగునీరు, మందులు దుప్పట్లను మయన్మార్, వియాత్నం, లావోస్‌కు తరలిస్తున్నట్టు చెప్పారు విదేశాంగ మంత్రి జైశంకర్.
మయన్మార్ అభ్యర్థనను స్వీకరించిన మానవతా పరిస్థితుల దృష్ట్యా మొదటగా స్పందించిన భారత దేశం తొలి విడతలో 21 టన్నుల రిలీఫ్ మెటీరియల్‌ని పంపింది. టెంట్‌లు, జనరేటర్ సెట్‌లు, రెడీ మెడ్ భోజనం, కిచెన్ సెట్‌లు, సోలార్ ల్యాంప్స్, మెడికల్ సామాగ్రి, దోమ తెరలు, రిపెల్లెంట్‌లు, నీటి శుద్దీకరణ మాత్రలు, క్రిమిసంహారకాలు సహా ఇతర పదార్థాలతో కూడిన హెచ్‌ఏడీఆర్ ప్యాలెట్‌లను తీసుకుని వెళ్ళే నావల్ షిప్ INS సత్పురా మంగళవారం యాంగాన్‌కు బయలేరింది.
ఈరోజు IAF IL-76 ద్వారా రెండవ విడత 32 టన్నుల సహాయం పంపబడింది. ఇందులో జెన్‌సెట్‌లు, తాత్కాలిక ఆశ్రయం కల్పించే టెంట్ లు, పరిశుభ్రత కిట్‌లు, సోలార్ ల్యాంప్‌లు , ఇతర ఉపశమన సామగ్రి ఉన్నాయి. అవసరమైన విధంగా మరింత సహాయాన్ని అందించడానికి అవసరానికి తగిన విధంగా అంచనా వేయబడుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..