టర్కీ, సిరియాలో మృత్యుఘోష కొనసాగుతోంది. వారం రోజు దాటినా.. ఎటుచూసినా శిథిలాలే, ఎక్కడచూసినా పెనువిషాదమే కనిపిస్తోంది. నగరాలు, పట్టణాలు శవాల దిబ్బల్లా మారిపోయాయి. శిథిలాలు తొలగించేకొద్దీ గుట్టగుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య 28వేలు దాటింది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య లక్షపైనే ఉండొచ్చని చెబుతున్నారు. శిథిలాలను తొలగిస్తున్నకొద్దీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది.
టర్కీ భూకంపంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. బిజినెస్‌మెన్ విజయ్‌కుమార్ మరణించినట్టు ఎంబసీ ప్రకటించింది. బిజినెస్ ట్రిప్ కోసం జనవరి 25న టర్కీ వెళ్లిన విజయ్‌కుమార్… ఫిబ్రవరి 6న సంభవించిన భూకంపంలో మిస్ అయ్యాడు. ఆరురోజుల తర్వాత మలాత్యాలోని అతను బస చేసిన హోటల్ శిథిలాల్లో విజయ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తించారు అధికారులు.
సమాచారం ప్రకారం.. రెస్క్యూ బృందాలు విజయ్‌కుమార్ ని వెదకడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. శిథిలాల కింద అతని ముఖం నుజ్జునుజ్జు కావడంతో అతడిని గుర్తించడం చాలా కష్టమైంది. అతని చేతిపై ఉన్న ఓం అనే పదం పచ్చబొట్టు ద్వారా విజయ్ ని గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, మాలత్య హోటల్ శిధిలాల నుండి ముందుగా బట్టలను గుర్తించారు. అనంతరం అతని మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. విజయ్ కుమార్ ఉత్తరాఖండ్ లోని గౌర్ పౌరీ జిల్లాలోని కోట్‌ద్వార్‌లోని పదంపూర్ ప్రాంతంలో నివాసి. 6 సంవత్సరాల కుమారుడు కూడా ఉన్నాడు.
5 రోజుల సెర్చ్ ఆపరేషన్ తర్వాత బ్యాడ్ న్యూస్ ..
టర్కీలో భూకంపం రావడంతో విజయ్ కుమార్ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. విజయ్ కోసం గత 5 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే చివరకు కుటుంబ సభ్యులు భయపడేది జరిగింది. విజయ్ మరణవార్త కుటుంబ సభ్యులకు తెలిసింది. విజయ్ మృతదేహాన్ని ముందుగా ఇస్తాంబుల్ తీసుకెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకురానున్నట్లు సమాచారం.
విజయ్ కుమార్ బెంగళూరులోని గ్యాస్ ప్లాంట్ కంపెనీ అయిన ఆక్సిప్లాంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో టెక్నీషియన్‌గా పనిచేశాడు. జనవరి 25న టర్కీకి వెళ్లిన విజయ్ మలత్యాలోని ఆపర్చునిటీ హాస్టల్‌లో ఉంటున్నాడు. రోజూ తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేవాడని.. భూకంపం వచ్చిన రోజు రాత్రి విజయ్ తన ఫ్యామిలీకి ఫోన్ చేయలేదు. మర్నాడు భూకంపం వచ్చిన విషయం తమకు తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం విజయ్ కుమార్ అదృశ్యం గురించి సమాచారం అందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ.. భూకంపం తర్వాత ఒక భారతీయుడు తప్పిపోయాడని, మరో 10 మంది శిధిలాలలో చిక్కుకుపోయారని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..