Tsunami Warning: తైవాన్‌లో భూకంపం.. జడుసుకుంటున్న జపాన్, చైనా.. ఆ వార్నింగ్ కారణంగానే..

|

Sep 19, 2022 | 7:29 AM

Tsunami Warning: భారీ భూకంపంతో వణికిపోయిన తైవాన్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందా? తైవాన్‌లో భూప్రకంపనలు వస్తే జపాన్‌ ఎందుకు భయపడుతోంది?

Tsunami Warning: తైవాన్‌లో భూకంపం.. జడుసుకుంటున్న జపాన్, చైనా.. ఆ వార్నింగ్ కారణంగానే..
Tsunami Warnings
Follow us on

Tsunami Warning: భారీ భూకంపంతో వణికిపోయిన తైవాన్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందా? తైవాన్‌లో భూప్రకంపనలు వస్తే జపాన్‌ ఎందుకు భయపడుతోంది? చైనా ఎందుకు ఉలిక్కిపడుతోంది? అవునుమరి.. 24గంటల్లో 100సార్లు ప్రకంపనలు, రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో తైవాన్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే ఈ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ప్రభావంతో 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశం ఉందని, రాకాసి అలలు పెద్దఎత్తున ఎగిసిపడే అవకాశముందని తైవాన్‌ను అప్రమత్తం చేసింది అమెరికా.

అలర్ట్ అయిన జపాన్..
ఇక తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ కూడా తమ దేశంలో సునామీ అలర్ట్‌ ఇష్యూ చేసింది. తైవాన్‌ను అనుబంధంగా ఉన్న ద్వీపంలో సునామీ వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యగా దక్షిణ ద్వీపం క్యుషును ఖాళీ చేయాలని సూచించింది. ఇక, చైనా కూడా తమ తీర ప్రాంతంలో కూడా భూప్రకంపనలు నమోదైనట్లు ప్రకటించింది. 7.2 తీవ్రతతో నమోదైన భూకంపంతో తైవాన్‌లో భారీ విధ్వంసం జరిగింది. అనేక ఇళ్లు నేలమట్టమైపోగా, వంతెనలు కూలిపోయాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. రోడ్లు, వంతెనలు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కువగా ఈశాన్య తైవాన్‌లో నష్టం జరిగింది.

24గంటల్లో 100సార్లు ప్రకంపనలు రావడంతో జనం ఇళ్లు, కార్యాలయాల నుంచి హాహకారాలు చేస్తూ బయటికి పరుగులు తీశారు. తైతూంగ్‌ సిటీకి సమీపంలోని సముద్రం తీరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తైవాన్‌ అంతటా భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. దాంతో, మరోసారి భారీ భూకంపం సంభవించే అవకాశముందని హెచ్చరించింది తైవాన్‌ ప్రభుత్వం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..