కేవలం నాలుగంటే 4 నిమిషాల్లో రూ.16.7 కోట్ల గోల్డ్ దోచేసారు!
కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే దుండగులు మెరుపు దాడి చేసి అమూల్యమైన ప్రాచీన సంపదను దోచుకెళ్లారు. స్పెయిన్‌లోని 'ట్రెజర్ ఆఫ్ విల్లెనా' మ్యూజియంలో చోటుచేసుకున్న ఈ సూపర్ ఫాస్ట్ దోపిడీలో.. కాంస్య యుగం నాటి అత్యంత అరుదైన పసిడి ఆభరణాలు, కళాఖండాలు మాయమయ్యాయి

అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ 2 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు ₹16.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మ్యూజియంలోని సిబ్బంది తేరుకునేలోపే దొంగలు తమ పని ముగించుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
స్పెయిన్‌లోని చారిత్రక ‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ మ్యూజియంలో దుండగులు కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలోనే మెరుపు దాడి చేసి భారీ దోపిడీకి పాల్పడ్డారు. ఈ హైప్రొఫైల్ హెయిస్ట్‌లో మ్యూజియంలో అత్యంత ప్రాచీన సంపదను దోచుకెళ్లారు. చోరీకి గురైన పసిడి ఆభరణాల విలువ మాత్రమే సుమారు 1.7 మిలియన్ యూరోలు అంటే దాదాపు 2 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. వీటితో పాటు వెలకట్టలేని అనేక ఇతర చారిత్రక కళాఖండాలు కూడా ఈ దొంగతనంలో మాయమయ్యాయి.
స్పెయిన్‌లోని విల్లెనా పట్టణంలో ఉన్న మ్యూజియంలో బంగారంతో తయారు చేసిన 50కి పైగా ప్రాచీన వస్తువులను దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. విల్లెనా మ్యూజియంలో ఉదయం 5.20 గంటలకు అలారం మోగింది. అయితే, అలారం మోగిన నాలుగు నిమిషాల్లోనే.. అంటే ఉదయం 5:24 గంటలకు దొంగలు మ్యూజియం భవనం నుంచి బయటపడి పరారయ్యారు.
వారు అత్యంత పురాతన నిధిలోని అత్యధిక భాగాన్ని దోచుకెళ్లారని విల్లెనా మేయర్ సెర్డాన్ అన్నారు. నిజానికి విల్లెనా వాసులమైన తమకు అది కోలుకోలేని దెబ్బ అనీ తాము తీవ్రంగా కలత చెందామనీ తెలిపారు. తనకు భయంతో వణుకు కూడా వస్తోందనీ అది తమ సాంస్కృతిక వారసత్వంలో, ఆ సొత్తు తమ సంపదలో ఒక భాగమని సెర్డాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ మ్యూజియం డిస్ ప్లేలో బంగారు గాజులు, గిన్నెలు ఇంకా అనేక ఇతర అరుదైన వస్తువులు ఉన్నాయి. స్పెయిన్ దేశం అలకాంటే ప్రావిన్స్‌లోని విల్లెనా పట్టణంలో ఉన్న ఒక చిన్న మ్యూజియంలో ఈ కళాఖండాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ చారిత్రక వస్తువులలో అత్యధికం బంగారంతో తయారు చేసినవి కాగా, మరికొన్ని వెండి, ఇనుము, అంబర్ లోహాలతో రూపొందించారు. ఇవి క్రీస్తు పూర్వం 1,000 సంవత్సరాల నాటివి అని పరిశోధకులు చెబుతున్నారు. ఆర్కియాలజిస్ట్ జోస్ సోలర్ 1963లో ఈ అరుదైన నిధిని కనుగొన్నారు. విల్లెనాలోని ఒక ఎండిపోయిన నదీ పరివాహక ప్రాంతంలోని మట్టిలో పూడ్చిపెట్టి ఉన్న ఒక పాత్రలో ఆయనకు ఈ ప్రాచీన సంపద లభించింది.
దొంగలు మ్యూజియంలోకి ఎలా ప్రవేశించారు?
దొంగలు వేరు వేరు వాహనాల్లో మ్యూజియం వద్దకు చేరుకుని, “కిటికీ ద్వారా” లోపలికి ప్రవేశించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే మ్యూజియంలో ఎలాంటి భద్రతా లోపాలు లేవని, “ఘటన జరిగిన సమయంలో మ్యూజియంలోని సెక్యూరిటీ అలారాలు ఒకేసారి యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. మ్యూజియంలో దోపిడీ జరగడానికి కాసేపటి ముందే, నగరంలోని ఒక స్పోర్ట్స్ సెంటర్‌లో కూడా సెక్యూరిటీ అలారం మోగింది. పోలీసుల దృష్టిని మళ్లించేందుకే దొంగలు కావాలని ఆ అలారాన్ని మోగించారా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
యురోప్ వ్యాప్తంగా పెరుగుతున్న మ్యూజియం దోపిడీలు
స్పెయిన్‌లోని విల్లెనా మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో యూరప్ వ్యాప్తంగా అనేక ప్రముఖ సాంస్కృతిక కేంద్రాలు, మ్యూజియంలలో ఇలాంటి వరుస హైప్రొఫైల్ దొంగతనాలు జరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్‌లో, పారిస్‌లోని ప్రసిద్ధ ‘లూవ్రే’ మ్యూజియంలోకి దొంగలు ఏకంగా పగటిపూటే చొరబడ్డారు. అక్కడ ఉన్న సుమారు 102 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు ₹853 కోట్లు) విలువైన అరుదైన ఆభరణాలను ఊడ్చేసి, కేవలం ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి తెలివిగా పరారయ్యారు.