Magic Spotted Lake : రంగు రుచి వాసన లేనిది సరస్సు ఆకాశంలోని రంగు రిప్లెక్ట్ అయ్యి . సముద్రంలోని నీరు నీలంగా కనిపిస్తుంది అంటారు. అయితే ఈ సరస్సు మాత్రం అందుకు భిన్నం.. వర్షాకాలం వస్తే.. ఆ సరస్సు నీటితో నిండుకుండలా కనిపిస్తుంది. ఐతే వేసవి వస్తే.. మాత్రం చుక్క నీరు ఉండదు. కానీ ఓ అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ఆ లేక్ బ్లూ, గ్రీన్, ఎల్లో వంటి రంగులతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇవన్నీ ఒకదానికి పక్కన మరొకటి కనువిందు చేస్తాయి. మరి ఒకే సరస్సులో ఇన్ని రంగులు ఎలా సాధ్యం? ఈ ప్రకృతి అందం వెనుక దాగున్న రహస్యమేంటి? ఈ సరస్సు ఎక్కడుంది? తెలుసుకుందాం..
ఈ లేక్‌లో ఎక్కడ చూసినా వలయాలే. ఒక్క సర్కిల్ ఒక్కో రంగులో ఉంది. కొన్ని బ్లూ కలర్‌లో ఉంటే… మరికొన్ని గ్రీన్, ఎల్లో కలర్స్‌లో కనువిందు చేస్తున్నాయి…. ఈ సరస్సు ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఈ అందమైన అద్భుత లేక్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. దీన్ని స్పాటెడ్ లేక్ అని పిలుస్తారు. 38 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సు యూఎస్, కెనడా మధ్య ఉంది. ప్రపంచంలోని ప్రకృతి వింతల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ఈ లేక్‌ను చూసి ఒకప్పుడు స్థానికులు భయపడేవారట.
ఓసోయూస్ అనే ప్రాంతంలో ఉన్న ఈ సరస్సు ఇప్పుడు అదే స్థానికులకు వరంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే టూరిస్ట్ స్పాట్‌లలో ఒకటిగా ఫేమస్ అయింది. ఈ సరస్సు రంగులు మార్చడానికి కారణం ఇక్కడి ఉష్ణోగ్రత, ఖనిజాలే. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. ఈ వేడికి నీరు ఆవిరైపోతుంది. ఎండలు పెరిగే కొద్దీ నీరంతా ఇంకిపోయి బురద మాత్రమే మిగులుతుంది. బురద చిన్న చిన్న వలయాల్లా మారుతుంది. వీటి మధ్యనున్న నేలపై నుంచి ఎంచక్కా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఈ వలయాల్లో ఉన్న ఖనిజ లవణాల ఘాడతను బట్టి రంగులు ఏర్పడుతుంటాయి.
స్పాటెడ్ లేక్‌లో ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం, సోడియం సల్ఫేట్ ఉంటాయి. వీటితోపాటు సిల్వర్, టైటానియం లాంటి మరో ఎనిమిది రకాల ఖనిజాలు నీటిలో కరిగిపోయి ఉంటాయి. సరస్సు వివిధ కలర్స్‌లో కనిపించడానికి కారణం ఇవే. ఖనిజ తత్వాన్ని బట్టి ఈ వలయాలు పసుపు, నీలం, ఆకుపచ్చవంటి రంగుల్లో కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యధిక గాఢతలో మినరల్స్ కలిగివుండే లేక్ ఇదే. అందుకే దీనికి స్పాటెడ్ లేక్ అనే పేరు వచ్చింది. ఇది ఉన్న ప్రాంతాన్ని బట్టి ఓసోయూస్ అని, కిలుక్ అనే పేర్లతో పిలుస్తుంటారు. ఈ సరస్సుకు, దీని నీటికి చాలా ప్రత్యేకతలున్నాయని భావిస్తారు స్థానికులు. ఈ నీటికి ఔషధగుణం ఎక్కువ అని నమ్ముతుంటారు. చర్మరోగాలు, అనారోగ్యంతో బాధపడేవారు ఈ నీటితో స్నానం చేస్తే అవన్నీ మాయమవుతాయట. ఈ సరస్సు మట్టిని ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో యుద్ధ సామాగ్రిని తయారు చేయడానికి ఉపయోగించేవారు. అలా అప్పటి నుంచే ఈ లేక్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. దీన్ని సందర్శించడానికి పర్యాటకులు క్యూకడుతుంటారు.