Shiva Temple: ఓ శివాలయం కోసం రెండు దేశాల యుద్ధం – ఆసక్తికర కథనం

ఆగ్నేయాసియాలో యుద్ధ భూతం మళ్లీ ముంచుకొచ్చింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన థాయ్‌లాండ్, కంబోడియా దేశాల మధ్య గల సరిహద్దులోని ఓ హిందూ ఆలయం పరిసరాల్లో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. గతంలో ఎన్నో సార్లు వివాదాలకు కేంద్రమైన ఈ ఆలయం మరోసారి కాల్పులకి కేంద్రబిందువైంది.

Shiva Temple:  ఓ శివాలయం కోసం రెండు దేశాల యుద్ధం - ఆసక్తికర కథనం
Shiva Temple

Edited By:

Updated on: Jul 24, 2025 | 5:42 PM

ప్రపంచంలో ఏ ఖండంలో చూసినా దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధాలు జరుగుతున్నాయి. యూరప్‌లో 2022లో మొదలైన ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతుండగా.. ఏడాదిన్నర క్రితం మొదలైన పాలస్తీనా – ఇజ్రాయెల్ యుద్ధం లెబనాన్, ఇరాన్, యెమెన్, సిరియా వంటి దేశాల వరకు విస్తరించి కొనసాగుతోంది. కొద్ది నెలల క్రితం దక్షిణాసియాలో భారత్ – పాక్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరగగా.. ఇప్పుడు ఆగ్నేయాసియాలో రెండు దేశాల మధ్య చిచ్చు యుద్ధానికి దారితీసింది. పర్యాటక స్వర్గధామంగా పేరొందిన థాయ్‌ల్యాండ్‌కి, దాని పొరుగునే ఉన్న కంబోడియా దేశానికి మధ్య యుద్ధం మొదలైంది. ఏకంగా F-16 ఫైటర్ జెట్లతో థాయ్‌ల్యాండ్ ఎయిర్‌స్ట్రైక్స్ చేసే వరకు వెళ్లింది. అంతకు ముందు రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ప్రాంతంలో కంబోడియా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లు పేలి థాయ్‌ల్యాండ్ సైనికులు గాయపడ్డారు. ఇలా మొదలైన ఘర్షణలు ఆ తర్వాత తీవ్రరూపం దాల్చాయి. పరస్పర కాల్పులు, గ్రనేడ్, రాకెట్ లాంఛర్ల ప్రయోగాల వరకు వెళ్లాయి. ఇరుపక్షాల ఘర్షణలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 14 మంది గాయపడ్డట్టు థాయ్‌ల్యాండ్ సైన్యం వెల్లడించింది.

ఘర్షణకు కారణం ఓ ఆలయం

థాయ్‌లాండ్, కంబోడియా దేశాలు 817 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల తరచుగా సరిహద్దు వివాదాలు తలెత్తుతున్నాయి. వాటిలో “తా మోవాన్ థమ్” ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఈ ఆలయం కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ.. సరిహద్దు రేఖలు నిర్ణయించుకునే విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా తరచుగా ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి.

ఈ రోజు ఉదయం జరిగిన తాజా ఘర్షణల్లో, రెండు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. కాల్పుల్లో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. కంబోడియా వైపు నుండి థాయ్‌లాండ్ భూభాగంలోకి డ్రోన్ దాడులు జరిగినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. ప్రతీకారంతో థాయ్‌లాండ్ సైన్యం కౌంటర్ యాక్షన్ మొదలుపెట్టింది. ఇందులో ఏకంగా F-16 వంటి అధునాతన ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాన్ని రంగంలోకి దించి, కంబోడియా లక్ష్యాలపై బాంబు దాడులు చేసింది.

ఆ ఆలయ చరిత్ర ఏంటంటే?

ఇటు థాయ్‌ల్యాండ్, అటు కంబోడియా.. రెండు దేశాల్లోనూ మెజారిటీ ప్రజానీకం అనుసరించేది బౌద్ధ మతాన్నే. సరిహద్దు వివాదంగా మారిన “తా మోవాన్ థమ్ ఆలయానికి (Ta Moan Thom Temple)” నిజానికి బౌద్ధంతో సంబంధం లేదు. కంబోడియాలోని ఓడ్డార్ మీన్‌చే (Oddar Meanchey) ప్రాంతంలో ఉన్న ఒక పురాతన హిందూ ఆలయం ఇది. ఇది థాయ్‌లాండ్-కంబోడియా సరిహద్దుకు సమీపంలో డాంగ్రెక్ పర్వత శ్రేణిలో ఉంది. ఈ ఆలయాన్ని ఖ్మెర్ సామ్రాజ్యం కాలంలో (11వ-12వ శతాబ్దాలలో) నాటి పాలకులు నిర్మించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయాల సమూహం “అంగ్‌కోర్‌వాట్” కూడా ఈ దేశంలోనే ఉంది. అయితే సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువుగా మారిన శివాలయం మాత్రం డాంగ్రెక్ పర్వతాలలో 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఖ్మెర్ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలో శివలింగంతో పాటు ఇతర హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అక్కడ స్థానికంగా దొరికే రాయితో ఈ ఆలయ నిర్మాణం సాగింది. ఈ ఆలయ శిల్పకళ కూడా అంగ్‌కోర్ వాట్ వంటి ఇతర ఖ్మెర్ ఆలయాలను పోలి ఉంటుంది.

ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను పరిశీలిస్తే.. ఖ్మెర్ సామ్రాజ్య కాలంలో ఇదొక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. రాజకీయ, సైనిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది. ఆలయం చుట్టూ ఉన్న సరిహద్దు ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇక్కడ రెండు దేశాల సైనిక స్థావరాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల కారణంగా పర్యాటకుల తాకిడి చాలా పరిమితంగా ఉంటుంది. థాయ్‌లాండ్, కంబోడియా సైనికులు ఈ ప్రాంతంలో తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతుండడంతో, పర్యాటకుల సందర్శన కష్టతరంగా మారుతోంది. దట్టమైన అడవులు, పర్వతాల మధ్య కొలువైన ఈ ఆలయంలో సహజ సౌందర్యం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. అయితే సైనిక కదలికల ఉద్రిక్తతల కారణంగా పర్యాటకుల ఆదరణకు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..