స్విట్జర్లాండ్‌ దేశంలో మొదలైన కరోనా వ్యాక్సినేషన్.. తొలి టీకా వేయించుకున్న 90 ఏళ్ల బామ్మ

కరోనాపై పోరు స్విట్జర్లాండ్‌ దేశం ఓ అడుగు ముందుకు వేసింది. ఫైజర్‌ టీకాకు శనివారమే స్విస్‌మెడిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం తెలిపింది.

స్విట్జర్లాండ్‌ దేశంలో మొదలైన కరోనా వ్యాక్సినేషన్.. తొలి టీకా వేయించుకున్న 90 ఏళ్ల బామ్మ
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 24, 2020 | 4:41 AM

మాయదారి కరోనాను తరమికొట్టేందుకు ప్రపంచ దేశాలన్ని పోరాటం చేస్తున్నాయి. అంటు వ్యాధిని అంతమొందించేందుకు చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సిద్ధమవుతున్నాయి. కరోనాపై పోరు స్విట్జర్లాండ్‌ దేశం ఓ అడుగు ముందుకు వేసింది. ఫైజర్‌ టీకాకు శనివారమే స్విస్‌మెడిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆ దేశ వ్యాప్తంగా లక్ష డోసుల ఫైజర్‌ టీకా పంపిణీని అక్కడి మిలిటరీ ప్రారంభించింది. ఇందులో భాగంగా లూసెర్న్‌ నగరానికి చెందిన 90 ఏళ్ల బామ్మ బుధవారం ఈ టీకా తొలి డోసును అందుకున్నారు. దీంతో స్విట్జర్లాండ్‌లో ఈ టీకా అందుకున్న తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. నర్సింగ్‌, కేర్‌ హోంలలో ఉన్నవాళ్లు తొలుత టీకాలు అందుకుంటారని లూసెర్న్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, స్విట్జర్లాండ్‌లో తొలుత 1.7లక్షల డోసుల టీకాలను మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం.. జనవరి నుంచి నెలకు 2.5 లక్షల డోసుల చొప్పున ఈ టీకాను పంపిణీ చేసేందుకు అక్కడి సైన్యం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఆదేశంలో ఎక్కువ జనాభా కలిగిన జ్యూరిచ్‌ నగరంలో మాత్రం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి 4 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిసెంబర్‌లోనే బ్రిటన్‌, అమెరికాలలో ఫైజర్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో తొలి టీకాను కూడా 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ అనే బామ్మకు వేయగా.. అమెరికాలో తొలి టీకాను ఓ నర్సు అందుకున్న సంగతి తెలిసిందే.