మనుషుల కంటే జంతువులు తెలివైనవనీ ముఖ్యంగా కోతులు, చింపాజీ, ఏనుగు వంటి జంతువులు మరింత తెలివైనవనీ తరచూ చెబుతుంటారు. కొన్ని కొన్ని సంఘటనలు పెద్దల మాటను రుజువు చేస్తూ మనుషులకు మించి తెలివి తేటలు చూపిస్తూ చకచకా పనులు చేస్తూ ఉంటాయి కోతి, కుక్క వంటి జంతువులు. ఈ విషయం తమ అధ్యయనంలో రుజువు అయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇటీవలి పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. చింపాంజీలు తమ శరీరానికి అయ్యే గాయాలను నయం చేసుకోవడానికి అడవిలో దొరికే వివిధ ఔషధ మొక్కలను ఉపయోగిస్తాయని వెల్లడించారు.
ఇటీవల బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఉగాండాలోని బుడోంగో సెంట్రల్ ఫారెస్ట్ రిజర్వ్ లో ఉన్న చింపాంజీలపై అధ్యయనం చేశారు. చింపాంజీల ప్రవర్తన, వాటి ఆరోగ్యంపై అధ్యయనం చేశారు. తమ పరిశోధనలో చింపాంజీలు తమ శరీరానికి అయ్యే గాయాలను నయం చేసుకుంటాయని వెల్లడించారు. తమకు ఏదైనా శారీరక ఇబ్బంది ఏర్పడితే వెంటనే వ్యాధిని నయం చేసుకోవడానికి చింపాంజీలు ఔషధ మొక్కలను వెదికి తింటాయని చెప్పారు. అయితే ఇలా యాదృచ్ఛికంగా మెడిసిన్ ఆకులు తింటున్నాయా.. లేక అవి వ్యాధులను నయం చేస్తాయని తెలిసే ఉద్దేశపూర్వకంగా తింటున్నయా అనే విషయం పూర్తిగా తెలియాల్సి ఉందని చెబుతున్నారు పరిశోధకులు.
51 అడవి చింపాంజీలపై పరిశోధన
చింపాజీలపై చేసిన పరిశోధన PLOS ONE పత్రికలో ప్రచురించబడింది. 51 అడవి చింపాంజీలపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు. ఇలా అధ్యయనం చేస్తున్న సమయంలో ఒక మగ చింపాంజీ తన చేతికి అయిన గాయాన్ని నయం చేసుకోవడానికి ఫెర్న్ ఆకులను వెదికి మరీ ఉపయోగించినట్లు చెప్పారు. ఈ ఫెర్న్ ఆకులను ఉపయోగించి తన చేతికి అయిన గాయాన్ని, నొప్పిని తగ్గించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు పరాన్నజీవి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మరొక చింపాంజీ .. స్కూటియా మిర్టినా అనే చెట్టు బెరడుని తిన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ బెరడులో ఔషధ గుణాలున్నాయని యాంటీబయాటిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.
రకరకాల మొక్కలు తినే చింపాంజీలు
అడవిల్లో నివసించే చింపాంజీలు తరచుగా వివిధ రకాల మొక్కలను తింటాయి. అవి తినే అడవిలోని చెట్లు, మొక్కల గురించి కూడా పరిశోధకులు అధ్యయనం చేశారు. చింపాంజీలు తినే చెట్లు, మొక్కలు ఆహారంలో భాగంగా పరిగణించబడవు. అయితే కొన్ని మొక్కలు ఔషధ గుణాలు కలిగి వివిధ గాయాలను తగ్గించవచ్చు.. అని అంటున్నారు. ముఖ్యంగా చింపాంజీలు ఉన్న అదవుల్లొని 88 శాతం మొక్కలు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధించే గుణాలు కలిగి ఉండగా.. 33 శాతం మొక్కలు మంటను తగ్గించే లక్షణలు కలిగి ఉన్నాయని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..