Sri Lanka Crisis: ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీలంక సర్కార్ ఆఫర్.. ఇక నుంచి శుక్రవారం కూడా అవసరం లేదంటూ..

|

Jun 18, 2022 | 5:35 AM

Sri Lanka Crisis: శ్రీలంకలో సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ప్రభావం ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు

Sri Lanka Crisis: ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీలంక సర్కార్ ఆఫర్.. ఇక నుంచి శుక్రవారం కూడా అవసరం లేదంటూ..
Sri Lanka
Follow us on

Sri Lanka Crisis: శ్రీలంకలో సంక్షోభం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఈ ప్రభావం ఆ దేశ ప్రభుత్వ ఉద్యోగులపైనా పడింది. శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులే పని చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. వచ్చే మూడు నెలల పాటు శని, ఆదివారాలతో పాటు శుక్రవారాలు కూడా సెలవు ఇచ్చింది ఆ దేశ ప్రభుత్వం. శ్రీలంకలో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు అడుగంటిపోయాయి. ఇప్పుడున్న నిల్వలు మరో మూడు రోజులే వస్తాయంటోంది అక్కడి ప్రభుత్వం. దాంతో ఇంధనం లేక, వాహనాలు కదలక రాకపోకలు కష్టమవుతున్నాయి. ముఖ్యంగా ఆఫీసులకు ఎలా రావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే మూడు నెలల పాటు శుక్రవారం కూడా హాలీడేగా ప్రకటించింది. అంటే వారానికి నాలుగు రోజులే పని అనమాట. శుక్ర, శని, ఆదివారాలు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అదనపు సెలవును సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించింది ప్రభుత్వం. ఆహార కొరత కూడా తీవ్రంగానే ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి పెరట్లో కూరగాయలు, పండ్లు పండించాలని కోరింది. దేశంలో దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కొరతతో కార్మికులకు ఉపాధి కరువైంది. ఉద్యోగులకు అదనపు సెలవు నిర్ణయంతో కార్మికులను కొంతవరకు ఆదుకునేందుకు కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రెండు కోట్లకు పైబడి జనాభా ఉన్న శ్రీలంక, గత 70 ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక ద్రవ్యానికి తీవ్ర కొరత ఉండటంతో ఆహార ధాన్యాలు, ఇంధనం, ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి శ్రీలంక నానాపాట్లు పడుతోంది.

ఇవి కూడా చదవండి

భారత్‌తో పాటు పలు దేశాలను సహాయం చేయాలని అభ్యర్థిస్తోంది. భారత్‌ ఇప్పటికే సాయం చేస్తోంది. మరోవైపు, పరిస్థితులు ఇలాగే కొనసాగితే శ్రీలంకలో మానవ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 10 లక్షల మంది బలహీన వర్గాల ప్రజలను ఆదుకునేందుకు 47 లక్షల డాలర్లు ఇస్తామని చెప్పింది. బెయిల్‌ అవుట్‌ ప్యాకేజ్‌ కోసం IMFతో శ్రీలంక చర్చలు జరుపుతోంది. ఈ నెల 20న IMF ప్రతినిధులు కొలంబో రానున్నారు. లంక సంక్షోభం ఎప్పటికి ముగుస్తుందో మరి!