శ్రీలంకలో(Sri Lanka) ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాంబుకానాలో పోలీసుల తూటాలకు ఒక వ్యక్తి బలైపోయిన తర్వాత శ్రీలంక యావత్తూ రగిలిపోతోంది. పోలీసు కాల్పులకు, పెట్రోధరల పెంపునకు వ్యతిరేకంగా ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దేశవ్యాప్తంగా జనం రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. రాజధాని కొలంబోతో పాటు గాలె, ట్రికోమలై, కాండీ, బట్టికలోవా, వెలిమెడ, తంగెల్లి, రాజంగనయ, కొట్టెదెనియనవ, దంబుల్ల, బలిపిటియ పట్టణాల్లో ప్రదర్శనలు కొనసాగాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో లీటర్ పెట్రోలు ధర ఒక్కసారిగా 338 రూపాయలకు చేరడాన్ని లంక ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.. రాంబుకానాలో నిరసన ప్రదర్శనపై పోలీసుల తుపాకీ ఎక్కుపెట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది.. మరోవైపు రాంబుకానాలో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. పోలీస్ కాల్పల్లో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతిపక్షాలతో పాటు నిరసనకారులు అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్సలపై ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వీరి రాజీనామా కోసం పట్టుబడుతున్నారు.. ఈ నేపథ్యంలో రాజపక్స ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంటులో మరో ముగ్గురు ఎంపీలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.. కాగా అన్ని రాజకీయా పక్షాలు కోరితే రాజీనామా చేసేందుకు అధ్యక్షుడు గొటబయ సిద్దంగా ఉన్నారని స్పీకర్ మహింద యాపా అబేవర్ధనే తనకు చెప్పారంటున్నారు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస..
మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ 3,800 కోట్ల డాలర్ల సాయాన్ని ప్రకటించింది. మరోవైపు దివాలా తీసిన లంకకు తాజాగా అప్పు ఇచ్చే విషయంలో చర్చలు మొదలయ్యాయని తెలిపింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.. అయితే ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి: CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్ క్లాస్..