Sri Lanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. శనివారం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స నివాసంలోకి ప్రవేశించి ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక దళాలు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీఛార్జ్ చేపట్టారు. దీంతో అధ్యక్షుడు అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఇక తాజాగా ఆ దేశ ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేశారు. తాజాగా అఖిలపక్ష సమావేశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే అధ్యక్షుడు రాజపక్స కూడా రాజీనామా చేసే అవకాశాలున్నాయి.
కాగా, కొందరు ఆందోళనకారులు అధ్యక్ష నివాసం మెయిన్ గేట్ ఎక్కి లోపలికి ప్రవేశించారు. దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించారు. ఆ ప్రాంతంలో సైనికులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ నిరసన కారుల ఆందోళనలో ఒక సెక్యూరిటీ గార్డు సహా 33 మంది గాయపడినట్లు కొలంబో నేషనల్ హాస్పిటల్ తెలిపింది.
అధ్యక్షుడి ఇంటిలోకి చొచ్చుకువచ్చిన ఆందోళనకారులు.. ఆయన నివాసంలోని స్విమ్మింగ్ ఫూల్‌లో స్విమ్మింగ్ చేశారు. అధ్యక్షుడు రాజపక్సను ఓ రహస్య ప్రాంతానికి తరలించింది సైన్యం. ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసంలోని వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహారాలను ఆరగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి