నీట మునిగిన రోడ్లు, చెత్తాచెదారం, బురదతో నిండిన నగరాలు, తేలియాడే వాహనాలు… ప్రస్తుతం ఐరోపా దేశం స్పెయిన్‌లో ఇలాంటి అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఆకస్మిక భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 205 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎంత మంది కనిపించకుండా పోయారో లెక్క తెలియాల్సి ఉంది. ముఖ్యంగా తూర్పు స్పెయిన్‌లోని వాలెన్సియా నగరాన్ని వరదలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఇక్కడ కేవలం ఎనిమిది గంటల్లో 12 అంగుళాల వర్షం కురిసింది. ఈ నగరంలో ఏడాది పొడవునా ఇంత వర్షం కురుస్తుంది.
వాలెన్సియా మధ్యధరా సముద్ర తీరంలో ఉంది. దాదాపు 50 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఈ నగరంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 200 మంది చనిపోయారు. చివరిసారిగా 1973లో స్పెయిన్‌లో ఇంత భారీ వర్షపాతం నమోదైంది. అంటే 50 ఏళ్ల రికార్డును ఈసారి వర్షం బద్దలు కొట్టింది. అప్పటికి దాదాపు 150 మంది చనిపోయారు. 1957లో వాలెన్సియాలో ఇంత తీవ్రమైన వరద సంభవించి 81 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంత వర్షం ఎందుకు పడిందంటే
చలి, వేడి గాలుల కలయికే ఈ వరదలకు కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక వల్ల దట్టమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షం కురిసింది. ఈ సంఘటనను స్పానిష్‌లో DANA అంటారు. ఇటీవలి కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలలో సంభవించిన వర్షాలు, విధ్వంసం సంఘటనలకు కారణం ఇదే.
శాస్త్రవేత్తల ప్రకారం మధ్యధరా సముద్రం వేడెక్కడం కూడా భారీ వర్షాలకు కారణమైంది. అందువల్ల అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం మధ్య ఉన్నందున తూర్పు, దక్షిణ స్పెయిన్ లో ఇటువంటి సంఘటనలు చాలా సులభంగా చోటు చేసుకుంటాయి. వేడి, తేమ, చల్లని గాలుల కలయిక దట్టమైన మేఘాలు, భారీ వర్షాలకు కారణం.
ఈ ఏడాది ఆగస్టులో మధ్యధరా సముద్రం ఉష్ణోగ్రత 28.47 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు కూడా దీనికి వాతావరణ మార్పులే కారణమని వెల్లడించారు. శిలాజ ఇంధన కాలుష్యం వల్ల కలిగే భూతాపం స్పెయిన్‌లో కుండపోత వర్షాలను దాదాపు రెట్టింపు చేసిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
హెచ్చరిక జారీ చేయడంలో జాప్యం..
సప్నేలో పరిస్థితి మరింత దిగజారడానికి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కూడా ఒక కారణమని చెబుతున్నారు. నివేదికల ప్రకారం చాలా మంది హెచ్చరిక జారీ చేసే సమయాన్ని ప్రశ్నించారు. స్పానిష్ వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ 12 గంటల తర్వాత.. స్థానిక అధికారులు స్పందిచినట్లు ఆరోపిస్తున్నారు. అప్పటికే ప్రజలు ఎక్కడ ఆశ్రయం పొందలనే విషయంలో చాలా ఆలస్యం అయింది. ఎత్తైన ప్రదేశాలకు వెళ్లలేరు.. రోడ్లపై నుంచి కదలలేరు.. వాలెన్సియా నుంచి సమీపంలోని పికాసాంటే పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన వరదలతో ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు. వరద నీరు రోడ్లపైకి వచ్చింది.
సహాయక చర్యల పరిస్థితి ఏమిటంటే
వాలెన్సియా ప్రాంతంలో 500 మంది స్పెయిన్ సైనికులు ఆపరేషన్‌లో చేరారని స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా మోహరించిన సైనికుల సంఖ్య 1,700కి పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ప్రజలు హెలికాప్టర్ల సహాయంతో మాత్రమే అక్కడికి చేరుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. స్పానిష్ ప్రభుత్వం ప్రజలను ఇంట్లోనే ఉండమని లేదా ఎత్తైన ప్రదేశాలకు చేరుకోమని అత్యవసర హెచ్చరికను జారీ చేసింది. స్పెయిన్ వాతావరణ సంస్థ AEMET ప్రకారం వాలెన్సియాతో సహా కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 12 గంటల కంటే తక్కువ సమయంలో 200 మిమీ (8 అంగుళాలు) వరకు వర్షం పడవచ్చని తెలిపింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..