S Jaishankar : కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇప్పటికే పలు దేశాలకు సరఫరా చేసి అందరి మన్ననలు పొందుతున్న భారత్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలకు రెండు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. యూఎన్ఓ, ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జీఏవీఐ తదితర అంతర్జాతీయ సంస్థల శాంతి బలగాల సేవలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ తెలిపారు. ఈ మేరకు జై శంకర్.. బుధవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. సార్క్ కోవిడ్-19 ఎమర్సెన్సీ ఫండ్ కోసం భారత్ గట్టిగా మద్దతిచ్చిన విషయాన్ని కూడా జై శంకర్ గుర్తు చేశారు.
ప్రపంచ అవసరాలను తీర్చడానికి ఫార్మసీ రంగం మొత్తం ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో భారత్ పొరుగు దేశాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందిస్తూ తోడ్పాటునందిస్తుందని జైశంకర్ వివరించారు. భారత్ ఇప్పటికే 25 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేసిందని.. మరో 49 దేశాలకు కూడా వ్యాక్సిన్ పంపేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని.. వచ్చే ఆరు నెలల్లో 300 మిలియన్ల టీకాలు వేయనున్నట్లు జై శంకర్ తెలిపారు.
Also Read: