రష్యా దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌లో మారణహోమం కంటిన్యూ అవుతోంది. యూరోపియిన్ యూనియన్‌కు ఉక్రెయిన్ దగ్గరవుతున్న కొద్దీ రష్యన్ సైనికులు దాడులు ముమ్మరం చేశారు. క్రెమెన్‌చుక్ టౌన్‌పై భీకర క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు. ఓ షాపింగ్‌మాల్‌పై మిస్సైల్ ఎటాక్స్ జరిగాయి. ఆ దాడిలో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. షాపింగ్‌మాల్ ఎలా అగ్నికి ఆహుతి అయ్యింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. మిస్సైల్ ఎటాక్స్ జరిగిన సమయంలో ఈ షాపింగ్ మాల్‌లో దాదాపు వెయ్యి మంది ఉండొచ్చని చెప్తున్నారు. షాపింగ్ మాల్ పూర్తిగా తగలబడిన నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్లు తీవ్రంగా ప్రయత్నించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
క్షిపణి దాడి కారణంగా మాల్‌ను మంటలు చుట్టుముట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్‌ఫైటర్లు కృషి చేస్తున్నారని జెలెన్‌స్కీ వెల్లడించారు. మంటల్లో చిక్కుకున్న వీడియోని ఆయన షేర్ చేశారు. డజన్ల మందిని రక్షిస్తున్నట్టు, మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా రష్యా దాడిని పొల్టవా రీజియన్ గవర్నర్ దిమిత్రో లునిన్ ఖండించారు. యుద్ధ నేరాలకు ముగింపు పలకాలని రష్యాని ఆయన కోరారు. రష్యా క్షిపణి పౌర భవనాన్ని ఢీకొట్టడం ఇది వరుసగా రెండోసారి. అంతకుముందు, ఆదివారం కైవ్‌లోని నివాస భవనాన్ని రష్యా క్షిపణి ఢీకొట్టిందని ఉక్రెయిన్ పేర్కొంది. నగర మేయర్ విటాలీ క్లిట్ష్కో ప్రకారం, ఈ దాడిలో ఒక చిన్నారితో సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఆదివారం, మాస్కో తన బలగాలు ఉత్తర, పశ్చిమ ఉక్రెయిన్‌లోని మూడు సైనిక కేంద్రాలపై దాడి చేశాయని.. వాటిలో ఒకటి పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉందని తెలుస్తోంది.