Russia-Ukraine War: యుద్ధక్షేత్రంలో మారుతున్న స్ట్రాటజీలు.. క్రిమియన్ బ్రిడ్జి ఘటనతో కుంగిపోయిన రష్యన్ దళాలు

తాజాగా.. ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్స్‌లో రెండు శక్తివంతమైన Tu-22 బాంబర్ బేస్‌లు నేలమట్టమయ్యాయి. మాస్కోకు 170 కిలోమీటర్ల చేరువలోనే జరిగిన ఈ దాడితో నేరుగా రష్యన్ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నే టార్గెట్ చేసింది ఉక్రెయిన్

Russia-Ukraine War: యుద్ధక్షేత్రంలో మారుతున్న స్ట్రాటజీలు.. క్రిమియన్ బ్రిడ్జి ఘటనతో కుంగిపోయిన రష్యన్ దళాలు
Russia Ukraine War

Updated on: Oct 09, 2022 | 1:58 PM

ఉక్రెయిన్ కీలక ప్రాంతాల్ని విలీనం చేసుకున్న తర్వాత కూడా.. యుద్ధక్షేత్రంలో ఆత్మరక్షణ మార్గంలోనే నడుస్తోంది రష్యా. తాజాగా.. ఉక్రెయిన్ డ్రోన్ ఎటాక్స్‌లో రెండు శక్తివంతమైన Tu-22 బాంబర్ బేస్‌లు నేలమట్టమయ్యాయి. మాస్కోకు 170 కిలోమీటర్ల చేరువలోనే జరిగిన ఈ దాడితో నేరుగా రష్యన్ మిలిటరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌నే టార్గెట్ చేసింది ఉక్రెయిన్. రష్యా పాలిట ఇదొక బ్లాక్‌డే కిందే లెక్క. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా సేనలకు సెట్‌బ్యాక్ తప్పడం లేదు. ఖాళీ భవనాల్లో రష్యన్ సైనికులు దాక్కున్నారన్న సమాచారంతో… అటువంటి ప్రాంతాల్లో విరుచుకుపడుతున్నాయి ఉక్రెయిన్ దళాలు.  ఉక్రెయిన్ ఆగ్నేయ ప్రాంతంలోని జపోరిజియా సిటీ అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌పై రష్యా జరిపిన బాంబు దాడిలో 17 మంది చనిపోయారు. యుద్ధంలో సామాన్య పౌరుల్ని పొట్టనబెట్టుకుంటున్నారంటూ రష్యాపై ప్రపంచ సమాజం మళ్లీ విమర్శలు మొదలుపెట్టింది.

క్రిమియాకు ఆయిల్‌ను తీసుకెళ్తున్న రష్యన్ ట్యాంకర్లను పేల్చివేశారు. 19 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి మొత్తం ధ్వంసమైంది. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తోంది రష్యా. ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న కీలక సమయంలో జరిగిన ఈ పేలుడు.. రష్యాను మరింతగా కుంగదీస్తోంది. ఎందుకంటే.. రష్యా ఆక్రమిత క్రిమియాలోని ఈ బ్రిడ్జి.. యుద్ధ వాహనాల తరలింపులో చాలా కీలకం.

ఇలా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న వేళ… తన బర్త్‌డే వేడుకల్ని కూడా నిరాడంబరంగా, గుట్టుచప్పుడు కాకుండా జరుపుకున్నారు పుతిన్. యుద్ధక్షేత్రంలో కొత్త సారధిని నియమించుకుంది రష్యా. జనరల్ సెగ్రీ సురోవికిన్ సారధ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధం కొత్త పుంతలు తొక్కబోతోంది. ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ ప్రాంతాల్లో జాయింట్ గ్రూపింగ్ ఆఫ్ ఫోర్సెస్ కమాండర్‌గా బాధ్యతలు తీసుకున్నారు జనరల్ సెగ్రీ. ఈ సైబీరియన్ వీరుడికి గతంలో తజికిస్థాన్, చెచెన్యా, సిరియాలతో పోరాడిన అనుభవముంది.

ఈ కొత్త సేనాపతి.. ఎటువంటి ఎత్తుగడలు వేస్తారు.. ఉక్రెయిన్ దూకుడుని ఎలా నియంత్రిస్తారు… అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ఖేర్సన్ ప్రాంతంలో 2,400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. ఖార్కివ్, లీమన్, మరికొన్ని ప్రాంతాలపై కూడా పట్టు బిగిస్తున్నాయి ఉక్రెయిన్ దళాలు. మొత్తానికి తాము మొదట్లో అండర్‌డాగ్‌గా భావించిన ఉక్రెయిన్‌..పెద్దపులిలా మారి తిరగబడ్డంతో పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డట్టయింది పుతిన్ పరిస్థితి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం