
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై ఎన్నో వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. ఆయన క్యాన్సర్‌కు సంబంధించి చికిత్స చేయించుకున్నారంటూ, పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. పుతిన్ అనారోగ్యాన్ని సూచించే ఎలాంటి సంకేతాలు లేవని వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించారు. తెలివి లేని వ్యక్తులు చేస్తున్న ఈ పనిని సహించేది లేమని హెచ్చరించారు. పుకార్లు వ్యాప్తి చేసేవారి విజ్ఞతకే ఈ విషయాన్ని వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్న పుతిన్ రెండు దశాబ్దాలకు పైగా రష్యాను పాలిస్తున్నారు. ఉక్రెయిన్ దాడి కంటే ముందే గతంలోనూ ఆయన అనారోగ్యంపై వదంతులు వినిపిస్తుండేవి. యుద్ధం సమయంలో అవి మరింత ఎక్కువయ్యాయి.
రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స చేయించుకునేందుకు నిరంతరం వైద్యుల సమక్షంలోనే ఉంటున్నారని గతంలో బ్రిటిష్ గూఢచారి అన్నారు. వైద్యం కోసం ఆయన తరచుగా సమవేశాలకు రాకపోవడం, వచ్చినా మధ్యలో విరామం తీసుకోవడం వంటివి చేస్తారని చెప్పారు. అయితే.. పుతిన్ అనారోగ్యం గురించి కచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. పుతిన్ ఇటీవల పొత్తికడుపు నుంచి ద్రవాన్ని తొలగించేందుకు సర్జరీ చేయించుకున్నారని ఓ వార్తా కథనం వెల్లడించింది.
మరోవైపు.. స్వీడన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఫిన్లాండ్ తరహాలోనే తామూ నాటో సభ్యత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు స్వీడన్ ప్రధాని మాగ్దలీనా అండర్సన్ ప్రకటించారు. అధికారికంగా నాటోలో చేరడమే కాకుండా రక్షణ పరమైన హామీలు సైతం తమకు కావాలని మాగ్దలీనా వెల్లడించారు. అయితే.. ఫిన్లాండ్, స్వీడన్‌లు నాటోలో చేరితే తమకు ఎలాంటి సమస్య లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి