Canada: కెనడాలో 215 మంది పిల్లల అవశేషాలు బయట పడటం ఇప్పుడు సంచలనంగా మారింది. 1978లో మూసివేయబడిన బ్రిటిష్ ‘కామ్‌లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్’లో ఈ పిల్లల ఆస్థి పంజరాలను కనుగొన్నారు. ఇందులో చాలా మంది మూడేళ్ల వయసు ఉన్నట్లు గుర్తించారు. ఈ అవశేషాలు భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్ స్పెషలిస్ట్ సహాయంతో కనుగొన్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కాగా, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నప్పుడు 4,100 మంది పిల్లలు మరణించినట్లు తేలింది. అయితే ఇందులో 215 మంది పిల్లల వివరాలు చేర్చబడలేదని గుర్తించారు. ఒకప్పుడు కెనడాలో అతిపెద్ద రెసిడెన్షియల్ పాఠశాలగా ఉన్న మైదానంలో వీరిని ఖననం చేసినట్లు కనుగొన్నారు. ఈ ఘటన దేశ చరిత్రలో చీకటి రోజు అని ఆ దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించారు.
అయితే 1840 నుంచి 1990 వరకు క్రైస్తవ చర్చిలు నిర్వహిస్తున్న పాఠశాలలకు హాజరైన 150,000 మంది పిల్లలలో చాలా మంది భయంకరైన శారీరక వేధింపులు, అత్యాచారాలు, పోషకాహారలోపం మరియు ఇతర దురాగతాలను నివేదిక నమోదు చేసింది. అయితే 2008లో కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు అధికారంగా క్షమాపణలు చెప్పింది. అయితే బ్రిటీష్ కొలంబియా కార్యాలయంతో కలిసి దర్యాప్తు కొనసాగుతుందని, లభ్యమైన అవశేషాలు భద్రపరుస్తామని అధికారులు తెలిపారు.
అయితే ఒక రాడార్ ద్వారా ఈ ఆస్థి పంజరాలు లభ్యమయ్యాయి. పాఠశాల ప్రాంగణంలో మరికొన్ని చోట్ల ఇంకా తవ్వకాలు జరపాల్సి ఉన్నందున ఆస్థి పంజరాల లెక్క ఎంత వరకు వెళ్తుందనేది తెలియడం లేదు. దేశంలో ఒకప్పుడు ఇదే అతిపెద్ద విద్యాసంస్థ. దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాల వారి పిల్లలు ఈ పాఠశాలలోనే చదివారు. కెనడాకు చెందిన పిల్లల పట్ల విద్యాసంస్థల్లో దారుణాలు జరిగాయంటూ ఐదు సంవత్సరాల కిందటే నిజ నిర్ధారణ కమిషన్ ఒక నివేదిక వెల్లడించింది. అయితే సరిగ్గా పట్టించుకోకపోవడంతో కనీసం 4100 మంది పిల్లల వరకు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఒకప్పుడు పాఠశాలలో బలవంతపు మత మార్పిళ్లు, హింసలు జరిగేవని తెలుస్తోంది. మాట వినని వారిని తీవ్రంగా కొట్టే వారని చెబుతున్నారు. ఇలాంటి హింసల వల్ల కనీసం 6 వేల మంది పిల్లలు చనిపోయి ఉంటారని అంచనా.