బంగ్లాదేశ్‌లో అశాంతి మంటలు చల్లారడం లేదు. హిందువులపై అఘాయిత్యాలు జరుగుతున్న ఆరోపణలు నిత్యం వస్తూనే ఉన్నాయి. చాలా మంది హిందువులు ఆ దేశం నుంచి వేరే దేశాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఈరోజు సోమవారం బంగ్లాదేశ్ వెళ్లి క్లిష్ట పరిస్థితులపై చర్చించారు. కాగా తాజా వివాదంతో.. భారత దేశం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే విషయంపై బంగ్లాదేశ్ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రజల రోజువారీ అవసరాలు తీర్చే వస్తువులు భారతదేశం నుంచి వెళ్తాయి. బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు వంటి ఆహార ఉత్పత్తుల గురించి భారతదేశం వైపు చూడవలసి ఉంటుంది. ఈ పరిస్థితిలో భారతదేశం ఎగుమతులు నిలిపివేస్తే? అన్న ఆలోచన వచ్చి.. రాబోయే కాలంలో ఉన్న ప్రమాదాన్ని గ్రహించిన బంగ్లాదేశ్ సర్కార్ ముందుగానే ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించింది.
ప్రోథోమ్ అలో నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ ట్రేడ్ అండ్ టారిఫ్ కమిషన్ బంగాళాదుంపలు, ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి భారతదేశం నుంచి కాకుండా ప్రత్యామ్నాయాల దేశాల కోసం వెతుకుతోంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. బంగ్లాదేశ్ కొన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకునే విషయం ఆలోచింనట్లు తెలుస్తుంది. అయితే ఆ దేశాల నుంచి తమ దేశానికి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చు భరించగలమా లేదా అన్న విషయంపై ఆ దేశ ప్రభుత్వం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
భారతదేశం బంగాళాదుంపలను భారీగా బంగ్లాదేశ్ కు ఎగుమతి చేస్తుంది. అదే సమయంలో ఉల్లిపాయలను భారతదేశం, మయన్మార్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. పాకిస్తాన్, చైనా, టర్కియే నుంచి కూడా ఉల్లిని దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది. అయితే అది చాలా తక్కువ పరిమాణంలోనే. ఈ స్థితిలో బంగ్లాదేశ్ ఉల్లి, బంగాళా దుంపలను దిగుమతి చేసుకోవడానికి భారత్‌కు ప్రత్యామ్నాయం కోసం తెగ వెదుకుతుంది.
బంగాళదుంపలను దిగుమతి చేసుకునేందుకు నాలుగు దేశాలను బీటీటీసీ పరిశీలించినట్లు తెలిసింది. అవి జర్మనీ, ఈజిప్ట్, చైనా , స్పెయిన్. ఉల్లి కోసం చైనా, పాకిస్థాన్, టర్కీ దేశాలను కూడా పరిశీలిస్తున్నారు. అదే సమయంలో బంగ్లాదేశ్ భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అప్పుడు అయ్యే దిగుమతి ఖర్చులపై ఆందోళన చెందుతోంది.
గతంలో భారత్ నుంచి రోజుకు 40 నుంచి 50 ట్రక్కుల ఉల్లిపాయలు బంగ్లాదేశ్ కు వెళ్ళేవి. బంగ్లాదేశ్ లో హిందువుల పై హింస మొదలైనప్పటి నుంచి దిగుమతులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు రోజుకు 10 నుంచి 12 లారీలు మాత్రమే వెళ్తున్నాయి. దీంతో తమ దేశ ప్రజలు ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి.. ప్రత్యామ్నాయాల కోసం వెదుకుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ వ్యవసాయ దేశమైనప్పటికీ ఆదేశంలో పండే పంటల ఉత్పత్తి.. డిమాండ్‌కు తగినట్లుగా లేదు.
బంగ్లాదేశ్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఒకటిన్నర లక్షల టన్నుల బంగాళాదుంపలను దిగుమతి చేసుకుంది. బంగ్లాదేశ్‌లో వార్షిక ఉల్లి డిమాండ్ 27-28 లక్షల టన్నులు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 20 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బంగ్లాదేశ్‌కు ఒకటిన్నర మిలియన్ డాలర్ల విలువైన బియ్యం భారత్ నుంచి ఎగుమతి చేయబడింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..