దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరోసారి ఆ దేశం పెట్రోల్, డీజిల్ ధరలను రికార్డు గరిష్ఠ స్థాయికి పెంచేసింది. లీటరు పెట్రోల్ ధరను రూ.14.91 పెంచడంతో ప్రస్తుతం ఇది రూ.305.36కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర రూ.18.44 పెంపుతో లీటరు రూ.311.84కు చేరుకుంది. లీటరు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 ఎగువునకు చేరుకోవడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే తొలిసారి. గత పక్షం రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను పాక్ ప్రభుత్వం పెంచడం ఇది రెండోసారి. ఇటీవల లీటరు పెట్రోల్‌ను రూ.20, లీటరు డీజిల్‌ను రూ.17.50 మేర పెంచారు. గత 15 రోజుల వ్యవధిలో లీటరు పెట్రోల్ రూ.31.41 పెరగ్గా.. డీజిల్ రూ.38.44 పెంచారు.
ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపు, నిత్యవసర సరకుల ధరాఘాతానికి వ్యతిరేకంగా ఆ దేశంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపు షాక్ నుంచి కోలుకోక ముందే ఇప్పుడు ప్రధాని అన్వారుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఇంధన ధరలు పెంచడంతో పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. అంతర్జాతీయ మార్గెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడమే ధరల పెంపునకు కారణమని పాక్ ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక గడ్డు పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకే మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇంధన ధరలను పెంచి ప్రజలపై భారం మోపాల్సి వచ్చిందని పాక్ పాలకులు చెప్పుకుంటున్నారు. పాకిస్థాన్ రూపాయి మారకం విలువ రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ కొనుగోలుకు పాక్ ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది.
పాక్‌లో రికార్డు గరిష్ఠ స్థాయికి ఇంధన ధరలు..
For the first time in Pakistan’s history, the price of petrol and diesel crossed Rs 300 mark. Petrol up by Rs 14.91 to Rs 305.36. Diesel price up by Rs 18.44 to Rs 311.84. This is a DISASTER for the public. pic.twitter.com/KdDaLwIvRw
— Syed Talat Hussain (@TalatHussain12) August 31, 2023
ఇంధన ధరలు భారీగా పెంచడంతో తిండి గింజలు, పాలు, గోధుమ పిండితో పాటు ఇతర నిత్యవసర సరకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆ దేశ ఆర్థిక నిపుణులు, ప్రతిపక్ష నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను కారణంగా చూపుతూ ఇంధన ధరలను రికార్డు స్థాయికి పెంచడం సరికాదని హెచ్చరిస్తున్నారు. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. నిత్యవసరాల ధరలు విపరీతంగా పెరిగితే సామాన్యులు బతుకు బండిని నడపడం కష్టతరంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్త అప్పుల కోసం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆంక్షలకు లోబడి ఇంధన ధరలు, విద్యుత్ ధరలను పాక్ ప్రభుత్వం ఎడాపెడా పెంచేయడం సరికాదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి.