
భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ‘మర్కజ్ సుభానల్లా’ను పాకిస్థాన్ ప్రభుత్వం అధికారిక అండదండలతో పునర్నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక దృశ్యాలు బయటకు వచ్చాయి.
సరిగ్గా ఏడాది క్రితం, 2025 మే 7న తెల్లవారుజామున 1:07 గంటలకు, భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటి జైష్ ప్రధాన స్థావరాలపై విరుచుకుపడ్డాయి. మూడు క్షిపణి దాడులతో మర్కజ్ సుభానల్లా ప్రాంగణం ఛిన్నాభిన్నమైంది. మర్కజ్ ప్రధాన హాలులో భారీ గొయ్యి ఏర్పడటంతో పాటు మూడు ప్రధాన గోపురాలు కూలిపోయాయి. ఈ దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ యూసుఫ్ అజార్, మసూద్ అజార్ బంధువులైన హాఫిజ్ జమీల్ అహ్మద్, హుజైఫా అజార్, మరియు హమ్జా జమీల్ వంటి కీలక ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాద శిక్షణ కేంద్రమైన ‘మదర్సా అల్-సాబిర్’, నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
భారత దాడిలో దెబ్బతిన్న ఉగ్రవాద కేంద్రాన్ని పునరుద్ధరించడానికి పాకిస్థాన్ ప్రభుత్వం బహిరంగంగానే సహకరిస్తోంది. అక్టోబర్ 2025లో నవాజ్ ప్రభుత్వం జైష్ సంస్థకు 25 కోట్ల పాకిస్తానీ రూపాయలను అందించినట్లు సమాచారం. ఈ నిధులతోనే ప్రస్తుతం మర్కజ్ సుభానల్లాలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. మార్చి 10న ప్రారంభమైన పనుల్లో భాగంగా, ధ్వంసమైన మూడు గోపురాలను ఇటుకలు, ఇనుప కడ్డీలతో తిరిగి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వాటికి ప్లాస్టరింగ్ చేసి, చెక్క నిర్మాణాలతో సపోర్ట్ ఇచ్చారు. పూర్తిగా నేలమట్టమైన మదర్సా అల్-సాబిర్, నివాస గృహాల పునాదులను నింపడానికి భారీగా ఇటుక దిమ్మెలను తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా మర్కజ్ ప్రాంగణం చుట్టూ ఉన్న గోడల ఎత్తును గణనీయంగా పెంచారు.
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఉగ్రవాద కేంద్రానికి పాకిస్థాన్ పంజాబ్ పోలీసులకు చెందిన “ఎలైట్ పోలీస్” విభాగం రక్షణ కల్పిస్తోంది. సాధారణంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టాల్సిన ఈ విభాగం, ఇప్పుడు జైష్ కార్యాలయం వద్ద కాపలా ఉంటోంది. బయటకు వచ్చిన వీడియోలలో ఎలైట్ ఫోర్స్ వాహనాలు, సాయుధ సిబ్బంది ఉగ్రవాద కేంద్రం వద్ద తిరుగుతూ స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పరిణామాలు అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ తీరును మరోసారి ఎండగడుతున్నాయి. ఒకవైపు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెబుతూనే, భారత్ ధ్వంసం చేసిన ఉగ్రవాద స్థావరాలను ప్రభుత్వ సొమ్ముతో పునర్నిర్మించడం పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..