
పాకిస్తాన్‌లో హిందూ యువకుడిపై దాడికి తెగబడ్డారు. సింధ్‌లోని కోట్డి ప్రాంతంలో హిందూ బాగ్రీ వర్గానికి చెందిన ఒక యువకుడిని చావబాదారు. స్థానిక తినుబండారంలో భోజనం చేశాడనే కారణంతో దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాకిస్తాన్ వార్తాపత్రిక ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బాధితుడు దౌలత్ బాగ్రి భోజనం తినడానికి ఒక ధాబాకు వెళ్ళాడు. ధాబా యజమాని సహా మరికొందరు అతన్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. దీంతో వివాదం రాజుకుంది. హిందూ యువకుడిని తాళ్లతో కట్టివేసి, దారుణంగా కొట్టి, అతని జేబులో నుండి 60,000 రూపాయల నగదును లాక్కున్నారు.
దౌలత్ బాగ్రి తనను కొట్టొద్దని పదే పదే వేడుకున్నాడు. అతను కేకలు వేస్తున్నప్పటికీ, కనికరించని దుండగులు తీవ్రంగా కొట్టారు. అక్కడ తినడానికి అతనికి ఎలా ధైర్యం వచ్చిందని అడిగారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కోసం డిమాండ్లు పెరిగాయి.
దౌలత్ బాగ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోట్డి పోలీసులు హోటల్ యజమానితో పాటు ఏడుగురు నిందితులు.. ఫయాజ్ అలీ, అర్షద్ అలీ, మోయిన్ అలీ, షఫీ మొహమ్మద్, నియాజ్, దార్ మొహమ్మద్, ఇక్రమ్‌లపై కేసు నమోదు చేశారు. అయితే, ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినప్పటి నుండి ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం. కేసు నమోదు చేయడానికి ముందు, జంషోరో జిల్లా సెషన్స్ కోర్టులో SSP, SHO జంషోరోపై ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసిన తర్వాతే పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం.
ఈ సంఘటన పాకిస్తాన్‌లో హిందూ మైనారిటీలపై, ముఖ్యంగా బాగ్రీ వంటి అణగారిన వర్గాలపై కొనసాగుతున్న సామాజిక వివక్ష, హింసను మరోసారి ప్రతిబింబిస్తోంది. అటువంటి వర్గాలు మతపరమైన అసమానత, సామాజిక బహిష్కరణ, పరిపాలనా ఉదాసీనతను ఎదుర్కొంటున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..