
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ రోజు రోజుకు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఇప్పటికే తోహాఖానా అంశంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించారు. అయితే తాజాగా స్ధానిక కోర్టు ఆయనకు ఇంకో షాక్ ఇచ్చింది. వివాహ చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన ఇమ్రాన్‌ఖాన్, ఆయన మొదటి భార్య బుష్రా బీబీకి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. బుష్రా ఇస్లామిక్ షరియా చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె మొదటి భర్త దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. 2018లో ఇమ్రాన్-బుష్రా చేసుకున్న పెళ్లి చెల్లదంటూ ఇస్లామాబాద్ కోర్టు పేర్కొంది. ఇద్దత్ నిబంధన ప్రకారం మహిళ భర్త చనిపోయినా లేదా విడాకులు తీసుకున్నా మూడు నెలల తర్వాత మరో పెళ్లి చేసుకునేందుకు షరియా చట్టాలు అంగీకరిస్తాయి. బుష్రా, ఇమ్రాన్‌ఖాన్ పెళ్లికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆమె మాజీ భర్త మనేకా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు వారికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. కేవలం ఒక్కవారంలోనే ఇమ్రాన్‌ఖాన్‌పై వెలుబడిన తీర్పుల్లో ఇది మూడోదిగా తెలుస్తోంది. ఫిబ్రవరి 8న జరిగే జాతీయ ఎన్నికలకు ముందు ఈ తీర్పులు రావడంతో పోటీకి ఇమ్రాన్ దూరమయ్యారు.
71 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌కు అధికారిక రహస్యాలను లీక్ చేశారంటూ పదేళ్లు, ప్రభుత్వ కానుకలను అమ్మారన్న కేసులో ఇప్పటికే 14 ఏళ్ల పాటు జైలుశిక్ష పడింది. వివాహం అయ్యేవరకు ఆమె ముఖం చూడలేదని భార్య బుష్రా గురించి ఇమ్రాన్‌ఖాన్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎంతో గొప్పగా చెప్పారు. బుస్రా తెలివితేటలు, వ్యక్తిత్వం తనని ఎంతో ఆకర్షించాయని చెప్పారు. కానీ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ చెప్పిన దాన్ని పట్టించుకోకుండా బుష్రాకు ఏవో మార్మిక శక్తులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారన్న కేసులో శిక్ష పడింది. సుమారు 14 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. పాక్ ఎన్నికలు జరగనున్న కీలక సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌కు వరుసగా శిక్షలు పడటం పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…