లిబియా, డిసెంబర్ 17: లిబియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దాదాపు 60 మందికి పైగా వలస దారులతో యూరప్‌కి బయల్దేరిన పడవ లిబియా తీరం వద్ద నీట మునిగినట్లు ఐక్యారాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. పడవలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నాట్లు తెలిపింది. మధ్యధరా సముద్రం గుండా ప్రయాణికులతో వెళ్తున్న పడవ లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణం తీరంలో వచ్చిన బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ప్రమాదం నుంచి బయటపడిన వలసదారులు వెల్లడించారు. పడవలో మొత్తం 86 మంది వలసదారులు ఉండగా అందులో 61 మంది నీట మునిగినట్లు వారు తెలిపారు.
కాగా మధ్యధరా సముద్రంలోని ఈ మార్గంలో గతంలోనూ పలు ప్రమాదాలు జరిగాయి. మెరుగైన జీవితాన్ని ఆశిస్తూ చాలా మంది ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా దేశాలకు వలస వెళుతుంటారు. అలాంటి వారంతా ఈ మార్గంలో పడవల్లో ప్రయాణిస్తుంటారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో యుద్ధం, పేదరికం కారణంగా ఇతర దేశాలకు వెళ్లే వలసదారులకు గత కొన్నేళ్లుగా లిబియా ప్రధాన రవాణా కేంద్రంగా ఉద్భవించింది. 2011లో గడాఫీని నాటో అంతమొందించిన తర్వాత ఆఫ్రికా దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఐరోపాకు చేరుకోవాలనుకుంటున్న వారంతా ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. ఈ ఏడాది మధ్యధర సముద్రంలో ప్రయాణిస్తూ దాదాపు 2,250 మంది వలసదారులు మృతి చెందినట్లు ఐఓఎం నివేదికలు తెలుపుతున్నాయి.
మరోవైపు లిబియాలోని కల్లోల పరిస్థితులు మానవ అక్రమ రవాణాదారులకు అనుకూలంగా మారాయి. ఆరు దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న లిబియా అక్రమ వలసదారులను రవాణా చేస్తున్నారు. రబ్బరుతో తయారు చేసిన పడవల్లో వీరందరినీ ప్రమాదకరమైన రీతిలో తీరం దాటిస్తుంటారు. ఎవరైనా పట్టుబడి తిరిగి లిబియాకు వస్తే వారిని ప్రభుత్వ నిర్బంధ కేంద్రాలలో ఉంచుతున్నారు. వీరిని నిర్బంధ శ్రామికులుగా మార్చడం, అత్యాచారం, హింసించడం వంటి ఘోరాలు వీరిపై జరుగుతున్నాయి. ఇలా లిబియాలో నిర్భందంలో ఖైదీలుగా ఉన్న వారు ఐరోపాకు వెళ్లాలంటే వారి వద్ద ఉన్న డబ్బు మొత్తం వసూలు చేస్తున్నట్లు ఐక్యరాజ్య సమిధి అధికార ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.